Rishi Sunak: ప్రధాని అయ్యాక తొలిసారి స్పందించిన రిషి సునాక్

Rishi Sunak first speech after he elected as Britain Prime Minister
  • బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్
  • ఇది అతి గొప్ప గౌరవం అని వెల్లడి
  • కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన సునాక్
  • బ్రిటన్ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని వివరణ
లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ (42) ఎన్నికవడం తెలిసిందే. ప్రధాని అయ్యాక రిషి సునాక్ తొలిసారి స్పందించారు. బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టడం తన జీవితంలో లభించిన అతి గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

అంకితభావంతో ప్రజా సేవకు పాటుపడిన లిజ్ కు నీరాజనాలు పలుకుతున్నానని తెలిపారు. ఇంటా బయటా బ్రిటన్ కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఎంతో హుందాగా బాధ్యతలు నిర్విర్తించారని రిషి సునాక్ ప్రశంసించారు. 

కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు నాపై నమ్మకం ఉంచడాన్ని నాకు లభించిన గౌరవంగా భావిస్తాను, వారి ఆదరణ నన్ను ముగ్ధుడ్ని చేసింది అని వివరించారు. నాకెంతో ఇచ్చిన ఈ దేశానికి తిరిగిచ్చే భాగ్యం తనకు దక్కిందని తెలిపారు. పార్టీకి కూడా శక్తివంచన లేకుండా సేవలు అందిస్తానని సునాక్ పేర్కొన్నారు. 

గ్రేట్ బ్రిటన్ ఒక గొప్ప దేశం అని, కానీ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన ఆర్థిక సవాలు ఎదుర్కొంటోందని, అందులో ఎలాంటి సందేహంలేదని వెల్లడించారు. ఇప్పుడు మనకు కావాల్సింది స్థిరత్వం, ఐకమత్యం అని రిషి సునాక్ పిలుపునిచ్చారు. 

పార్టీని, దేశాన్ని సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని అన్నారు. మన పిల్లలకు, వారి పిల్లలకు ఘనమైన భవిష్యత్తును అందించే క్రమంలో సవాళ్లను అధిగమించేందుకు ఇదొక్కటే మార్గమని స్పష్టం చేశారు.
Rishi Sunak
Speech
Prime Minister
Britain

More Telugu News