Xi Jinping: చైనా అధ్యక్షుడుగా మరోసారి జిన్ పింగ్

The world needs China says Xi Jinping after securing third term
  • చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియామకం
  • స్వయంగా ప్రకటన చేసిన జిన్ పింగ్
  • ఆధునిక సోషలిస్ట్ దేశంగా నడిపిస్తానని ప్రకటన
  • కొత్త ప్రధానిగా లీ కియాంగ్
అనుకున్నట్టుగానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా షీ జిన్ పింగ్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగాను మరోసారి జిన్ పింగ్ ఎన్నికయ్యారు. జిన్ పింగ్ స్వయంగా ఆదివారం దీనిపై ప్రకటన చేశారు. ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ మహాసభలు శనివారంతో ముగిసిన సంగతి విదితమే. కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ సహజంగా అధ్యక్షుడు అవుతారు. 

ఇక ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న లీ కెకియాంగ్ కు జిన్ పింగ్ ఉద్వాసన పలకడం తెలిసిందే. ఆ స్థానంలో తన అనుచరుడైన లీ కియాంగ్ ను నూతన ప్రధానిగా జిన్ పింగ్ ప్రకటించారు. లీ కియాంగ్ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ షాంఘై విభాగం కార్యదర్శిగా పనిచేశారు. ఏడుగురు సభ్యుల పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీని సైతం జిన్ పింగ్ ప్రకటించారు. ఇందులో జిన్ పింగ్, కొత్త ప్రధాని లీ కియాంగ్ తోపాటు, ఝూవో లిజి, వాంగ్ హూనింగ్ తదితరులు ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాలన వ్యవహారాలు, దేశ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీయే నిర్ధేశిస్తుంటుంది. 

ప్రపంచం లేకుండా చైనా అభివృద్ధి సాధించలేదని జిన్ పింగ్ పేర్కొన్నారు. అలాగే, ప్రపంచానికి చైనా అవసరమన్నారు. పార్టీని అత్యున్నత స్థానంలోకి తీసుకెళ్లామని, భవిష్యత్తులోనూ మరింత సమష్టిగా నడిపిస్తామని ప్రకటించారు. వివిధ దేశాల అధినేతలు అభినందనలు తెలియజేస్తున్నారంటూ, వారికి ధన్యవాదాలు ప్రకటించారు. తన టీమ్ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, చైనాను ఆధునిక సోషలిస్ట్ దేశంగా ముందుకు తీసుకెళతానని ప్రకటించారు.
Xi Jinping
securing third term
president
china communist party

More Telugu News