Sachin Tendulkar: పాకిస్థాన్ డేంజరస్ బౌలర్ షహీన్ అఫ్రిదీని ఎలా ఎదుర్కోవాలో చెప్పిన సచిన్

Sachin explains how to tackle Pakistan pacer Shaheen Afridi
  • ఇటీవల గాయపడిన షహీన్ అఫ్రిదీ
  • ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ తో ఉన్న పాకిస్థాన్ పేసర్
  • రేపు మెల్బోర్న్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • అందరి కళ్లు అఫ్రిదీపైనే!
గత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదీ ఎలా దెబ్బతీశాడో భారత అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. తన స్వింగ్ బౌలింగ్ లో భారత టాపార్డర్ ను వణికించిన షహీన్ అఫ్రిది... ఆ మ్యాచ్ లో భారత్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. 

ఇప్పుడు మరోసారి షహీన్ అఫ్రిదీతో కూడిన పాకిస్థాన్ జట్టును ఎదుర్కొనేందుకు టీమిండియా సమాయత్తమవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు (అక్టోబరు 23) భారత్, పాక్ జట్లు మెల్బోర్న్ లో తలపడనున్నాయి. అయితే, షహీన్ అఫ్రిదీని టీమిండియా బ్యాట్స్ మెన్ ఎలా ఎదుర్కొంటారన్న దానిపై చర్చ జరుగుతోంది. 

దీనిపై భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. షహీన్ అఫ్రిదీ అటాకింగ్ బౌలర్ అనడంలో సందేహంలేదని, అతడు ఎప్పుడూ వికెట్ల కోసం ప్రయత్నిస్తుంటాడని వెల్లడించాడు. అతడి బంతులు గుడ్ లెంగ్త్ ఏరియా ఆవల పిచ్ అవుతుంటాయని, అతడి బౌలింగ్ లో స్వింగ్ కూడా ఉండడంతో ఆడేందుకు కష్టసాధ్యమవుతుందని వివరించాడు. 

అంతేకాదు, గాల్లోనే బంతి దిశ మారేలా బౌలింగ్ చేసే సామర్థ్యం షహీన్ అఫ్రిదీకి ఉందని స్పష్టం చేశాడు. కుడిచేతివాటం బ్యాట్స్ మన్లకు లోపలికి స్వింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసే సత్తా ఉందని, అంతేకాకుండా షార్ట్ పిచ్ బంతితో ఎల్బీడబ్ల్యూ చేసే నైపుణ్యం అతడి సొంతం అని సచిన్ వివరించారు. 

ఇలాంటి బౌలింగ్ ను అడ్డదిడ్డంగా ఆడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సచిన్ హెచ్చరించాడు. షహీన్ అఫ్రిదీ బంతులను సాధ్యమైనంత స్ట్రెయిట్ గా ఆడాలని సలహా ఇచ్చాడు. మిడాన్, మిడాఫ్ ల మధ్యన ఉండే 'వి' షేప్ జోన్ లో ఖాళీలను గుర్తించి అతడి బంతులను బౌండరీకి తరలించాలని సూచించాడు.
Sachin Tendulkar
Shaheen Afridi
India
Pakistan
T20 World Cup

More Telugu News