Australia: టీ20 వరల్డ్ కప్ లో ఘోరంగా ఓడిపోయిన ఆతిథ్య ఆస్ట్రేలియా

Host Australia suffers huge lose in T20 World Cup
  • సూపర్-12 దశలో ఆసీస్ వర్సెస్ కివీస్
  • సిడ్నీలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కంగారూలు
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 రన్స్ చేసిన న్యూజిలాండ్
  • 17.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా జట్టు సిడ్నీలో ఘోర పరాజయం చవిచూసింది. సూపర్-12 దశలో భాగంగా నేడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

న్యూజిలాండ్ విసిరిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కంగారూలు చతికిలపడ్డారు. లక్ష్యానికి కనీసం దరిదాపులకు కూడా రాలేక 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆసీస్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 3, మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ 2, ఫెర్గుసన్ 1, ఇష్ సోథీ 1 వికెట్ తీశారు. 

ఆతిథ్య ఆసీస్ జట్టులో గ్లెన్ మ్యాక్స్ వెల్ 28, పాట్ కమిన్స్ 21 పరుగులు చేశారు. డేవిడ్ వార్నర్ (5), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (13), మార్కస్ స్టొయినిస్ (7), మాథ్యూ వేడ్ (2) విఫలమయ్యారు. 

అంతకుముందు, ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆసీస్ బౌలింగ్ ను ఉతికారేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేశారు. 

కివీస్ కొత్త ఓపెనర్ ఫిన్ అలెన్ 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేయగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 58 బంతులాడి 92 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. కాన్వే 7 ఫోర్లు, 2 సిక్సులతో విజృంభించాడు. 

కెప్టెన్ విలియమ్సన్ 23, గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగులు చేయగా, ఆఖర్లో ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ 13 బంతుల్లో 2 సిక్సులతో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజెల్ వుడ్ కు 2, జంపాకు ఓ వికెట్ దక్కాయి.
Australia
New Zealand
Super-12
Sydney
T20 World Cup

More Telugu News