Asaduddin Owaisi: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ఆడొద్దని అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

  • టీమిండియా పాక్ వెళ్లనప్పుడు వరల్డ్ కప్ లో ఆ జట్టుతో ఎందుకు ఆడాలని ప్రశ్న
  • ఏదేమైనా ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్య
  • పాక్ ను చిత్తు చేసేందుకు షమీ, సిరాజ్ రాణించాలన్న ఎంఐఎం అధినేత
Nahi khelna tha Owaisi ahead of India Pakistan cricket match in Melbourne

భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు టీమ్‌ను పంపకూడదని భారత్ నిర్ణయించుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని అన్నారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత్, పాక్ మధ్య మ్యాచ్ కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన ఒవైసీ ‘రేపు పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? మేము పాకిస్థాన్‌కు వెళ్లము అన్నప్పుడు ఆ జట్టుతో ఆడకూడదు కదా! పాక్ వెళ్లము కానీ, ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో ఆడుకుంటాం అంటారా? పాక్ తో ఆడకుంటే ఏమవుతుంది? రూ.2,000 కోట్ల నష్టం వస్తుందా? కానీ, అది మన దేశం కంటే ముఖ్యమా? వదిలివేయండి, ఆడకండి’ అని అసద్  పేర్కొన్నారు. 

వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన ప్రకటనపై ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఆదివారం పాక్ తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నానని అసద్ చెప్పారు. ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసేందుకు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌ తమవంతు కృషి చేయాలని కోరుకుంటున్నానని అసదుద్దీన్ అన్నారు. అయితే, భారత్ ఓడిపోతే మాత్రం ముస్లిం క్రికెటర్లపై నింద వేయొద్దన్నారు. ‘భారత్ గెలిస్తే జబ్బలు చరుకునే వాళ్లు ఓడిపోగానే ఆ తప్పుకు కారణం ఎవరిదో వెతకడం మొదలుపెడతారు. మీకు మా హిజాబ్, మా గడ్డంతో పాటు మా క్రికెట్‌తో కూడా సమస్య ఉందా?’ అని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News