Team India: ఐపీఎల్ మాదిరిగా అతను భారత్ కు ఒంటిచేత్తో ప్రపంచ కప్ అందిస్తాడు: ఆసీస్ దిగ్గజం వాట్సన్

Hardik Pandya can win India the T20 World Cup on his own says Shane
  • హార్దిక్ పాండ్యా పై వాట్సన్  ప్రశంసల వర్షం
  • అతను చాలా ప్రతిభావంతుడని కితాబు 
  • ఆదివారం పాకిస్థాన్ తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటుతాడని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ షేన్ వాట్సన్ అన్నాడు. టీమిండియాకు ఈ హార్దిక్ ఒంటి చేత్తో  కప్ అందిస్తాడని కొనియాడాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్ లో వున్న పాండ్యాపై వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ గొప్ప ప్రదర్శనతో సత్తా చాటుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్న పాండ్యాపై భారత జట్టు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఈ క్రమంలో వాట్సన్ అతని గురించి మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడన్నాడు. తను 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తూ మిడిల్ ఓవర్లలో జట్టుకు అవసరమైన వికెట్లు రాబట్టగలడన్నాడు. ‘అతని  బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాండ్యా కేవలం ఫినిషర్ మాత్రమే కాదు, పవర్ హిట్టర్ కూడా. అతని దగ్గర అన్ని రకాల నైపుణ్యాలున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ లో అతని అద్భుత ప్రదర్శన అంతా చూశాం. గుజరాత్ టైటాన్స్ కు ఐపీల్ ట్రోఫీని అందించినట్టే ఇప్పుడు టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ అందిస్తాడు’ అని చెప్పుకొచ్చాడు. ఇక, ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి  పాకిస్థాన్ తో భారత్ పోరు ఆరంభించనుంది.
Team India
T20 World Cup
hardik pandya
Australia

More Telugu News