Deepavali: దీపావళి సెలవుపై తెలంగాణ ప్రభుత్వం తాజా ప్రకటన!

Telangana government declares 24th as Deepavali holiday
  • 24వ తేదీని దీపావళిగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • దీపావళి సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు
  • 24వ తేదీ సాయంత్రం ప్రారంభమవుతున్న అమావాస్య
దీపావళి ఈ నెల 24వ తేదీనా? లేక 25వ తేదీనా? అనే సందేహాలకు తెలంగాణ ప్రభుత్వం తెరదించింది. ఈ నెల 24న అంటే రాబోయే సోమవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. దీపావళి సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో విడుదల చేసిన సెలవుల జాబితాలో దీపావళి సెలవు తేదీని మారుస్తున్నట్టు తెలిపింది. అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు 24వ తేదీనే పండుగ జరుపుకోవాలని పురోహితులు కూడా చెపుతున్నారు. పంచాంగాల్లో సైతం ఇదే ఉందని అంటున్నారు. 

దీపావళికి సంబంధించి అందరిలో నెలకొన్న సందేహానికి కారణం ఏమిటంటే..  క్యాలెండర్లో ఈ నెల 25న అమావాస్య ఉండటమే. దీంతో, అదే రోజున దీపావళి అని చాలా మంది భావించారు. కానీ పంచాంగాల్లో మాత్రం 24వ తేదీనే అని ఉంది. దీపావళిని సూర్యాస్తమయ వేళల్లో నిర్వహిస్తారు. 25వ తేదీన తిథి అమావాస్య ఉన్నప్పటికీ... సాయంత్రం 4.25 కల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేస్తుంది. అదే 24వ తేదీన అయితే సాయంత్రం 4.25 గంటలకు అమాస్య ప్రారంభమై కొనసాగుతుంది. దీంతో, 24వ తేదీ సాయంత్రాన్నే అమావాస్యగా భావించాలని పంచాంగం చెపుతోంది. ధనలక్ష్మీ పూజలను కూడా అదే రోజున నిర్వహించాలని పండితులు చెపుతున్నారు.
Deepavali
Telangana
Holiday

More Telugu News