Nara Lokesh: వాల్మీకి, బోయలను ఎస్టీలో చేర్చడంపై జగన్ రెడ్డి కొత్త డ్రామా మొదలుపెట్టాడు: నారా లోకేశ్

Lokesh slams CM Jagan over reservations
  • టీడీపీ బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో లోకేశ్ సమావేశం
  • బీసీలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించినట్టు వెల్లడి
  • బీసీలకు టీడీపీ చేసినంత మేలు మరే పార్టీ చేయలేదని స్పష్టీకరణ
  • జగన్ రెడ్డి దొంగదెబ్బ తీశాడని విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. జగన్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఉద్యమ కార్యాచరణ, సాధికార కమిటీల ఏర్పాటు, బలోపేతంపై చర్చించినట్టు లోకేశ్ తెలిపారు. బీసీల్లో ఉన్న అన్ని కులాలకు ప్రాతినిధ్యం, కులాల వారీగా సమస్యల అధ్యయనం పై ప్రణాళికపై సమాలోచనలు చేసినట్టు వివరించారు. 

"బీసీలకు టీడీపీ చేసినంత మేలు ఏ ఇతర పార్టీ చెయ్యలేదు. 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో బీసీలకు అత్యున్నత స్థానం కల్పించింది. కానీ, బీసీలను జగన్ ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల ముందు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ఇప్పుడు దొంగ దెబ్బతీసింది. 34% రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉండానికి కారణం టీడీపీ అయితే, బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గడానికి కారణం జగన్ రెడ్డి. 

వాల్మీకి/ బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు నాడు టీడీపీ సర్కారు కేంద్రానికి తీర్మానం పంపింది. అధికారంలోకి వస్తే వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చేందుకు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి  ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. మూడున్నరేళ్ల తరువాత కమిషన్ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. 

బీసీ కులాలకి జరుగుతున్న అన్యాయం, దాడులపై మీరంతా ఒక్కటై పోరాడితే... మీ ముందుండి తెలుగుదేశం నడిపిస్తుంది. మళ్లీ మనం వస్తున్నాం... బీసీల ప్రభుత్వం వస్తోంది... సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలకు భరోసా ఇవ్వండి" అంటూ నారా లోకేశ్ బీసీ సాధికార కమిటీల కన్వీనర్లకు కర్తవ్య బోధ చేశారు. 

ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు దువ్వారపు రామారావు, రామాంజనేయులు, టీడీపీ జనార్దన్ లతో పాటు 54 సాధికార కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.
Nara Lokesh
Jagan
Valmiki
Boya
BC
ST
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News