పరిస్థితులు దిగజారుతున్నాయ్.. తక్షణమే ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోండి: ఇండియన్స్ కు అక్కడి భారత ఎంబసీ హెచ్చరిక
- ఉక్రెయిన్ లో నాలుగు ప్రాంతాల్లో మార్షల్ లా విధించిన రష్యా
- పరిస్థితులు ఏ క్షణంలోనైనా మరింత దిగజారే అవకాశం
- విద్యార్థులతో సహా అందరూ వెళ్లిపోవాలన్న ఇండియన్ ఎంబసీ
ఉక్రెయిన్ లో తమ అధీనంలోకి వచ్చిన నాలుగు ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మార్షల్ లా విధించారు. దీంతో, ఈ ప్రాంతాలన్నీ రష్యా సార్వభౌమాధికారం కిందకు వచ్చినట్టే లెక్క. ఈ అర్ధరాత్రి నుంచి ఈ చట్టం అమల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల నుంచి ఉక్రేనియన్లు ప్రాణాలను అరచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
మరోపక్క, ఇదే ఊపులో ఉక్రెయిన్ పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయి. నాటో దళాలు జోక్యం చేసుకుంటే రష్యా అణ్వాయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులు చేయి దాటితే... అప్పుడు ఉక్రెయిన్ నుంచి బయటపడే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు.