YSRCP: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు హైకోర్టు నోటీసులు

ap high court issues notices to gannavaram mla vallabhaneni vamsi
  • ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలంటూ వెంకట్రావు పిటిషన్
  • రెండేళ్ల తర్వాత హైకోర్టులో విచారణకు వచ్చిన పిటిషన్
  • వంశీ సహా గన్నవరం రిటర్నింగ్ అధికారి, ఈసీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
  • ఈ నెల 28కి విచారణ వాయిదా

టీడీపీ రెబల్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందున వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్ లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేయగా... వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించిన వంశీ గత కొంత కాలం క్రితం టీడీపీకి దూరంగా జరిగి వైసీపీకి చేరువయ్యారు. అయితే రెండేళ్ల క్రితమే వంశీ ఎన్నికను రద్దు చేయాలంటూ వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రెండేళ్ల క్రితం పిటిషన్ వేస్తే ఇప్పటిదాకా ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ కాలేదని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల్లో భాగంగా ప్రసాదంపాడులో వంశీ అనుచరులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. వెంకట్రావు వాదనలు విన్న కోర్టు.. వంశీతో పాటు గన్నవరం రిటర్నింగ్ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News