టీకాల కంటే కూడా కరోనా ఇన్ఫెక్షన్ వల్లే గుండెకు అధిక ముప్పు 

  • కరోనా ఎంఆర్ఎన్ఏ రకం టీకాలతో మయోకార్డైటిస్ రిస్క్
  • కరోనా ఇన్ఫెక్షన్ లో ఇదే రిస్క్ ఎన్నో రెట్లు అధికం
  • పెన్ స్టేట్ వర్సిటీ పరిశోధక అధ్యయనం వెల్లడి
Myocarditis induced by COVID19 infection is substantially greater than the risk posed by vaccines

కరోనా రక్షణ కోసం తీసుకునే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారిత టీకాలతో గుండెకు ముప్పు ఏర్పడుతున్నట్టు ఇటీవలే ఓ శాస్త్రవేత్త ప్రపంచాన్ని హెచ్చరించారు. కానీ, కరోనా రక్షణ టీకాల కంటే కూడా కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మయోకార్డైటిస్ ఏర్పడే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది. 

మయోకార్డైటిస్ అంటే గుండె కణజాలంలో వాపు ఏర్పడడం. దీన్నే ఇన్ ఫ్లమ్మేషన్ అని అంటారు. కొవిడ్ టీకాతో పోలిస్తే కొవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా మయోకార్డైటిస్ ముప్పు ఏడు రెట్లు అధికమని ఈ పరిశోధన గుర్తించింది. మయోకార్డైటిస్ లో ఛాతీలో నొప్పి, శ్వాస సరిగా ఆడక పోవడం, గుండె స్పందనలు గతి తప్పడం కనిపిస్తుంది. ఇది తీవ్రమైతే హార్ట్ ఫెయిల్యూర్ ఏర్పడి మరణం సంభవిస్తుంది.

టీకాలు తీసుకున్న వారికి తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ ముప్పు నుంచి రక్షణ లభిస్తున్నట్టు ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు తెలియజేస్తున్నాయి. అదే సమయంలో టీనేజ్ బాలురలో ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మయోకార్డైటిస్ రిస్క్ ఎదురవుతున్నట్టు కూడా బయటపడింది. దీనిపైనే పెన్ స్టేట్ టీమ్ పరిశోధన చేసింది. కరోనా టీకాలు తీసుకోని వారు, తీసుకున్న వారి మధ్య వ్యత్యాసాన్ని, కరోనా వైరస్ బారిన పడిన వారు, పడని వారి మధ్య వ్యత్యాసాన్ని పరిశోధకులు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

తర్వాత కరోనా టీకాలు తీసుకున్న వారు, తీసుకోని వారి మధ్య మయోకార్డైటిస్ రిస్క్ రేటును పరిశీలించారు. టీకాలు తీసుకోని వారితో పోలిస్తే టీకాలు తీసుకున్న వారికి మయోకార్డైటిస్ ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటున్నట్టు తెలిసింది. పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 2019 డిసెంబర్ నుంచి 2022 మే వరకు జరిగిన 22 అధ్యయనాల గణాంకాలను కూడా సమీక్షించారు. 

‘‘కరోనా ఇన్ఫెక్షన్, అందుకు సంబంధించి టీకాలతో మయోకార్డైటిస్ రిస్క్ ఉంటోంది. కాకపోతే కరోనా టీకాల కంటే కూడా కరోనా ఇన్ఫెక్షన్ వల్ల గుండెలో ఇన్ ఫ్లమ్మేషన్ రిస్క్ చాలా అధికంగా ఉంటోంది’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన పెన్ స్టేట్ హెల్త్ మిల్టన్ ఎస్ హెర్షే మెడికల్ సెంటర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడిసిన్ ఫిజీషియన్ డాక్టర్ పాండే పేర్కొన్నారు. తమ అధ్యయన ఫలితాలు టీకాల ఆమోదాన్ని పెంచుతాయని భావిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News