Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం: దిగ్విజయ్

Digvijay singh speaks about special status to Andhrapradesh
  • ఆంధ్రప్రదేశ్ లోని ఆలూరులో ఏఐసీసీ లీడర్ దిగ్విజయ్ 
  • తెలంగాణ అవతల టీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్న  
  • ప్రత్యేక రాష్ట్రం ఎందుకిచ్చామో రాహుల్ గాంధీనే చెప్తారని వ్యాఖ్య 
  •  ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని విమర్శ
తెలంగాణ దాటితే మిగతా రాష్ట్రాల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎక్కడుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం ఆలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర చైర్మన్ గా దిగ్విజయ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ యాత్రకు హృదయపూర్వక స్వాగతం పలికిన ఏపీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం తమకే సాధ్యమని తేల్చిచెప్పారు. 

ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇదే హామీతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని వివరించారు. తెలంగాణ విషయంలో హామీని నిలబెట్టుకున్నామని, ఏపీకి ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రులను మోసం చేశారని దిగ్విజయ్ ఆరోపించారు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.

భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించాక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇచ్చామనే విషయం స్వయంగా రాహుల్ గాంధీనే చెబుతారని దిగ్విజయ్ వివరించారు. విద్వేష రాజకీయాలు, హింసపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని తెలంగాణ ప్రజలను ఆయన కోరారు. కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందిస్తూ.. తెలంగాణ అవతల టీఆర్ఎస్ కు గానీ బీఆర్ఎస్ కు గానీ చోటేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కోరికలు ఎక్కువవుతున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో ఏం జరగనుందో వేచి చూడాల్సిందేనని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Congress
bharath jodo yatra
degvijay singh

More Telugu News