బరువు తగ్గితే బహుమతి.. గడ్కరీ హామీతో 32 కిలోలు తగ్గిన ఉజ్జయినీ ఎంపీ

  • ఒక్కో కిలోకు వెయ్యికోట్ల నిధులకు మంత్రి హామీ
  • తన నియోజకవర్గానికి 32 వేల కోట్లు వచ్చాయని ఎంపీ ఆనందం
  • అవసరమైతే మరింత బరువు తగ్గుతానని వెల్లడి
BJP MP Claims He Shed 32 kg

బరువు తగ్గితే నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో ఓ ఎంపీ ఏకంగా 32 కిలోల బరువు తగ్గారు. అధిక బరువును వదిలించుకోవడంతో ఆరోగ్యంగా ఉన్నానని, అదే సమయంలో తన నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. 

వివరాల్లోకి వెళితే.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియాకు ఈ ఏడాది జూన్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ హామీ ఇచ్చారు. ఒక్క కిలో బరువు తగ్గితే నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ఫిట్ ఇండియా’ పథకం ప్రారంభిస్తూ కేంద్ర మంత్రి ఈ హామీ ఇచ్చారు. దీంతో ఎంపీ ఫిరోజియా కష్టపడి కసరత్తులు చేసి ఇప్పటి వరకు 32 కిలోలు తగ్గారు. గడ్కరీ ఇచ్చిన మాట ప్రకారం తన నియోజకవర్గానికి 32 వేల కోట్లు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఉదయాన్నే 5:30 గంటలకు మేల్కొని మార్నింగ్ వాక్ కు వెళ్లడం, ప్రతిదినం యోగా చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా తన అధిక బరువును వదిలించుకున్నట్లు ఎంపీ ఫిరోజియా చెప్పారు. ఉదయం తేలిక పాటి టిఫిన్, మధ్యాహ్నం సలాడ్, కాయగూరలు, చపాతీలతో భోజనం చేశానని తెలిపారు. ఈ నియమాలతో గతంలో 127 కిలోల బరువున్న తాను ఇప్పుడు 95 కిలోలకు తగ్గానని ఫిరోజియా చెప్పారు. తాను బరువు తగ్గితే నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయంటే మరింత బరువును కోల్పోవడానికి సిద్ధమని ఫిరోజియా స్పష్టం చేశారు.

More Telugu News