Odisha: అప్పు చెల్లించలేదని.. యువకుడిని బైక్‌కు కట్టి మూడు కిలోమీటర్లు లాక్కెళ్లిన వైనం

Youth tied to bike and dragged on the streets of Cuttack over Rs 1500
  • ఒడిశాలోని కటక్‌లో ఘటన
  • అప్పు చెల్లించనందుకు ఆగ్రహం
  • అందరూ చూస్తుండగానే బైక్‌కు తాడుకట్టి లాక్కెళ్లిన నిందితులు
  • కేసు నమోదు చేశామన్న పోలీసులు
తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ కొందరు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హింసించారు. బైక్‌కు తాడుకట్టి మూడు కిలోమీటర్లు లాక్కెళ్లారు. ఒడిశాలోని కటక్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన తాత చనిపోవడంతో ఖర్చుల కోసం బాధిత యువకుడు జగన్నాథ్ కొన్ని రోజుల క్రితం నిందితుల వద్ద రూ. 1500 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించకపోవడంతో ఆదివారం రాత్రి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చిన అప్పిచ్చిన వ్యక్తి.. యువకుడితో గొడవకు దిగాడు. అతడిని చితకబాదిన అనంతరం రెండు చేతులను తాళ్లతో కట్టి తాడు చివరను తన బైక్‌ వెనక కట్టాడు. 

అనంతరం బైక్‌ను రద్దీ రోడ్డుపై వేగంగా పోనిచ్చాడు. దీంతో బాధితుడు మూడు కిలోమీటర్ల మేర బైక్ వెనక పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ ఘటనను అందరూ చూస్తున్నా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. ట్రాఫిక్ పోలీసులు చూసి కూడా అడ్డుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
Odisha
Cuttack
Bidanasi

More Telugu News