Pawan Kalyan: ​​మంగళగిరిలో వాడీవేడిగా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్... పూర్తి వివరాలు ఇవిగో!

  • విశాఖను వీడిన పవన్ కల్యాణ్
  • మీడియా సమావేశంలో వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు
  • భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం
  • తాము ఎవరికీ భయపడబోమని స్పష్టీకరణ
  • పోలీసులపై తనకు కోపం లేదని వ్యాఖ్య  
Pawan Kalyan press meet in Managalagiri

విశాఖ నుంచి తీవ్ర పరిణామల నేపథ్యంలో మంగళగిరి చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే తాము జనవాణి ప్రకటించామని అధికార పక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఒకరికి అడ్డం వెళ్లాలని తామెప్పుడూ ఆలోచించమని అన్నారు. 

విశాఖ గర్జన కార్యక్రమం చేస్తామని వైసీపీ వాళ్లు ప్రకటన చేయడానికి మూడ్రోజుల ముందే తాను వైజాగ్ కు విమాన టికెట్లు బుక్ చేసుకున్నానని, ఇంతకుమించి ఆధారాలు ఇంకేం కావాలని పవన్ కల్యాణ్ తెలిపారు. 

"అమరావతి రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదు, మూడు రాజధానులపై ఎవరూ నోరెత్తకూడదని వాళ్లు భావిస్తున్నారు. మాది ఓ రాజకీయ పార్టీ. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడి మీరే దిగజారిపోయారు. 

మొదటి నుంచి కూడా కుల గొడవలతోటి రాష్ట్రం నిస్సారమైపోయింది. మళ్లీ దాంట్లో మూడు ప్రాంతాలు... ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. ఓసారి తమిళనాడు వాళ్లు తరిమేశారు, మరోసారి తెలంగాణ రాజకీయ నేతలు తరిమేశారు... అయినాగానీ మన రాజకీయ వ్యవస్థకు సిగ్గులేకపోతే ఎట్లా? ఇప్పుడు బయటివాళ్లు ఎవరూ తరిమేయకపోయినా, మనవాళ్లను మనమే తరిమేసేలా పరిస్థితులు సృష్టిస్తున్నారు. మూడు రాజధానులను అందరూ మర్చిపోతున్నారన్న కారణంగా ఇప్పుడు రెచ్చగొట్టే పనులకు పాల్పడుతున్నారు.

సంఘవిద్రోహ శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఎదుర్కోవాల్సిన ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోంది. కోనసీమలో జరిగింది ఇదే. వైసీపీ నేతల నోళ్లకు అడ్డుఅదుపు ఉండదు. మాట్లాడితే బూతులే. ఇంట్లోవాళ్లను కూడా తిడుతుంటారు. రాజకీయాలంటే భయపడిపోవాలని వారు అనుకుంటారు. కానీ వైసీపీ ఉడుత ఊపులకు ఎవరు భయపడతారు?

జనవాణి నిర్వహించాలనేది మా పార్టీ పరమైన నిర్ణయం. మా కార్యక్రమం రోజునే గర్జన కార్యక్రమం పెట్టుకుంది మీరు. అయినా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు గర్జించడం, కూతలు కూయడం ఏంటి? గర్జించేది ఎవరంటే... ప్రభుత్వంలో లేని నిస్సహాయులు. అధికారంలో దూరంగా ఉన్నవాళ్లు మా కడుపుకోత వినండి, మాకు అన్యాయం జరిగింది అని గర్జిస్తారు. 

మేం సామాజిక బాధ్యత ఉన్నవాళ్లం. అవసరమైతే గొడవలు పెట్టుకుంటాం, అయితే అవి నిర్మాణాత్మకంగా ఉంటాయి. కానీ వైసీపీకి మాత్రం వయొలెన్స్ కావాలంటారు, కోనసీమలో కూడా వాళ్లు అదే ప్రయత్నం చేశారు. వాళ్ల మంత్రి విశ్వరూప్ ఇంటిని వాళ్లే తగలబెట్టి, మా వాళ్లపై వేయాలని చూశారు. దాన్నికూడా తిప్పికొట్టాం. ఈ క్రమంలో వైజాగ్ లో జరిగింది కూడా అదే. వాళ్లు నిర్వహిస్తున్న కార్యక్రమం విఫలం కావడం, గంట తర్వాత నగరంలో అడుగుపెట్టిన మాకు విపరీతమైన జన స్పందన లభించడం, ప్రజాబలం చూసి వాళ్లు ఓర్వలేకపోయారు. 

వాళ్లు ఎంత పకడ్బందీగా చేశారంటే... ఒక మంత్రి, టీటీడీ చైర్మన్, ఇంకొక ఎమ్మెల్యేనో, మంత్రో నాకు సరైన అవగాహన లేదు కానీ, అతడు నన్ను బూతులు తిట్టే వ్యక్తి... వీళ్లందరూ కలిసి వెళుతుంటే కాన్వాయ్ పై దాడి చేశారని చెబుతున్నారు. మరి వారికి భద్రత కల్పించాల్సిన పోలీసులు ఏమయ్యారు? నాడు సీఐఎస్ఎఫ్ నియంత్రణలో ఉండే ఎయిర్ పోర్టులో కోడికత్తి దాడి జరిగితే, అతడు కోడికత్తితో లోపలికి ఎలా వెళ్లాడన్నది నేటికీ సమాధానం లేదు. అలాగే, ఇప్పుడు జరిగిన ఘటనలు ఎవరి పనో మరో ఏడాది తర్వాత తెలుస్తుంది. వీళ్ల మనుషులే ఎవరో దొరుకుతారు. 

ఇప్పుడు విశాఖలో జరిగిన ఘటనలో ఎవరు దొరికారంటే.... నేను, మనోహర్ వస్తున్నామని తెలిసి మాకోసం అనుమతులు కోరిన 14 మంది నేతలను అరెస్ట్ చేశారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇది అయిపోయిన తర్వాత 107 మందిపై కేసు పెట్టారు. భారతదేశంలో ఎక్కడా ఇలా జరగలేదు. 

వైసీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్టు అమ్మ, ఆలి అంటూ బూతులు మాట్లాడినా కేసులు ఉండవు, వాళ్లు ఇతర పార్టీ ఆఫీసులపై దాడులు చేసినా కేసులు ఉండవు. 2019లో వీళ్లు రాళ్లు విసిరితే అప్పటి డీజీపీ అది భావప్రకటన స్వేచ్ఛ అన్నారు. మరి వాళ్లు చేస్తేనేమో భావ ప్రకటన స్వేచ్ఛ, ఇక్కడ మేం రాళ్లు కూడా వేయలేదు... 107 మందిపై కేసులు పెట్టారు. ఇంట్లో రెండేళ్ల పసిబిడ్డతో ఉన్న రూపా అనే మా కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారు. 

పోలీసులను, ఐపీఎస్ అధికారులను మనం ఎంతో ఉన్నతంగా చూసుకుంటాం. అలాంటి స్థాయి ఉన్న అధికారి ఒకరు వచ్చి నాతో గొడవపెట్టుకోవాలని చూశారు. నేను మాట్లాడితే మాట్లాడకూడదంటాడు, మాట్లాడితే వార్నింగ్ లు ఇస్తాడు... దాంతో నేను చేసిన తప్పేంటి అని ఆ అధికారిని అడిగాను. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏమైనా చేశానా? నాకున్న హక్కుల పరిధిలోనే నేను వ్యవహరిస్తున్నాను... ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు అని ఆయనను అడిగాను.

అందుకాయన ట్రాఫిక్ ఆగిపోయింది అని బదులిచ్చారు. అతడే నా వాహనం ముందుకు కదలొద్దని అంటాడు, అతడే ట్రాఫిక్ ఆగిపోయిందని అంటాడు. మీరే ఇంత వితండవాదం చేస్తే ఎలా... ఇప్పుడు నన్నేం చేయమంటారు? అని ఆ అధికారిని అడిగాను. జనాలు ఎవరూ రోడ్డు మీద ఉండకూడదని అన్నాడు. నేనెళ్లి కర్ర తీసుకుని వాళ్లందరినీ తరమాలా? అని అడిగాను. అలా కాదు, ఏదో ఒకటి చేయండి అన్నాడు. దాంతో నేను నిస్సహాయంగా నిలిబడిపోవాల్సి వచ్చింది. 

నాకు పోలీసులపై ఎలాంటి కోపం లేదు. నేనక్కడ ఉండగానే అతడికి ఎవరెవరో ఫోన్లు చేశారు. సార్ సార్ అంటూ అతడు వారితో మాట్లాడాడు. అతడితో మాట్లాడింది ఎవరో నాకు తెలుసు. మమ్మల్ని అడ్డుకున్నందుకు మేం రెచ్చిపోతే శాంతిభద్రతల సమస్యపై మమ్మల్ని తీసుకెళ్లి మూసేయాలన్నదే వాళ్ల ఉద్దేశమని అర్థమైంది. కానీ నేను అధికారంలో ఉన్నవాడ్ని కాదు, ఎమ్మెల్యేని కాను, ఓ సామాన్యుడ్ని. అతడు యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారి, అక్కడ నేను ఏంచేయగలను? 

నాకు మీపై ఎలాంటి కోపం లేదు... మీరు ఇలా చేయడం సబబా? అని పోలీసులను అడిగాను. మీపై ఎంత ఒత్తిడి ఉన్నా ఈ విధంగా చేయడమేంటని అన్నాను. ఏపీ పోలీసులపై ఏమాత్రం నమ్మకంలేదన్న వ్యక్తి కింద పనిచేస్తున్న మీరు, ఏపీ మీద అపారమైన గౌరవం ఉన్న మమ్మల్ని మీరు హింసిస్తున్నారు... ఇంతకంటే ఇంకేం చెప్పగలం అని అన్నాను. 

జనసేన పార్టీ ఎందుకు పెట్టానంటే క్రిమినల్ పాలిటిక్స్ నాకు నచ్చవు. నేరగాళ్లు రాజకీయనేతలుగా మారి చట్టాలు చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు ఇలాంటి క్రిమినల్స్ కు సలాం కొడుతుంటే దేశం ఈ స్థాయికి దిగజారిపోయిందా? అనిపిస్తుంది. ఇలాంటి క్రిమినల్స్ నన్ను పరిపాలించకూడదని నేను భావిస్తాను. అందుకు నేనేం చేయాలని భావించి ఓ బలమైన ఆశయంతో జనసేన పార్టీ స్థాపించాను. 

జైల్లో తమను బెల్టులతో కొట్టారని, మోకాళ్లపై నడిపించారని మా నేతలు చెప్పారు. మా మహిళా నేతలను కొట్టారు. అసభ్యకర పదజాలం ఉపయోగించారు. ఇలాంటి చర్యల ద్వారా మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఈ మంగళిగిరి ప్రెస్ మీట్ నుంచి వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నాను. మేం ఇంకా బలంగా పోరాడతాం, ఏం చేస్తారో చేసుకోండి... నోరు జారే ప్రతి వైసీపీ నేతకు చెబుతున్నా... దీనిపై మీరు బాధ్యత వహించాలి. 

ఉత్తరాంధ్రపై వీళ్లకు ప్రేమ అంటారు... భోగాపురం భూములపై అప్పటి ప్రభుత్వంపై కేసు వేయాలని బాధితులకు సూచించి, ఇప్పుడవే భూములను వాళ్లనుంచి లాగేసుకుంటున్నారు. ఇవ్వకపోతే బెదిరింపులు! దసపల్లా భూముల్లోనూ ఇలాగే చేశారు. సైనికులకు సంబంధించిన 71 ఎకరాలు మంత్రి ధర్మాన, ఆయన మనుషులు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. 

అత్యధిక ముఖ్యమంత్రులు వచ్చిందే రాయలసీమ నుంచి... మరి ఆ ప్రాంతం వెనుకబడి ఉందని ఇతరులపై ఎలా రుద్దుతారు? మీ ఉద్దేశం రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించాలనా? వైసీపీ కోరిక ఇదేనా? తిప్పికొడితే 13 జిల్లాలు లేవు... వాటిని 26 జిల్లాలు చేశారు సరే. మనుషుల్ని విడగొట్టడానికి అంతెక్కడుంది. కులం, మతం అని కొట్టుకుచస్తుంటే అభివృద్ధి ఎక్కడుంటుంది? ప్రజలు కూడా ఇది గ్రహించాలి. ఎంతో అభిమాన బలం ఉన్న నా అంతటివాడినే ఓ ఐపీఎస్ అధికారి బెదిరించగలిగాడంటే, గ్రామాల్లో ఉండే సామాన్యుల పరిస్థితి ఏంటి?" అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

More Telugu News