Pawan Kalyan: విశాఖలో వైసీపీ నాయకులపై దాడి కేసు.. అర్ధరాత్రి జనసేన నాయకుల అరెస్ట్

Visakha Stone pelting Case police arrested janasena leaders
  • రోజా ఇతర నాయకులపై జనసేన శ్రేణుల రాళ్లదాడి
  • కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
  • పవన్ బస చేసిన నోవాటెల్ వద్ద భారీ భద్రత
విశాఖలో వైసీపీ మంత్రులు, నాయకులపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన కేసులో పోలీసులు గత అర్ధరాత్రి జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. విమానాశ్రయం వద్ద జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు దాని ఆధారంగా నిందితులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోన తాతారావు, పీతల మూర్తియాదవ్, విశ్వక్‌సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్‌రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, కీర్తీస్, యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజులను అరెస్ట్ చేశారు.

మంత్రి రోజా, ఇతర వైసీపీ నాయకులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడ వారిపై రాళ్లతోను, జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ జనసేన నాయకులు వారిని దూషిస్తూ దాడికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమైనట్టు తెలిపారు. మరోవైపు, జన సేనాని పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. పవన్ బస చేసిన ఫ్లోర్‌లో తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో పవన్‌తోపాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా బస చేశారు. నోవాటెల్ వైపు వచ్చే కార్యకర్తలు, అభిమానులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
Pawan Kalyan
Janasena
Visakhapatnam
YSRCP
Stone Pelting

More Telugu News