Odisha: ఒడిశా సీఎం సంచలన నిర్ణయం.. 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

Odisha Cabinet abolishes contractual recruitment set to benefit over 57000 employees
  • తన 76వ బర్త్ డే సందర్భంగా ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి
  • ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటన
  • దీపావళి ముందే వచ్చిందంటూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంబరాలు
  • ప్రభుత్వంపై ఏటా రూ. 1300 కోట్ల భారం
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 76వ బర్త్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ నియామకాలు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం వివరించారు. ఇందుకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రతి సంవత్సరం ఖజానాపై అదనంగా రూ.1300 కోట్ల భారం పడుతుంది. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని శాశ్వతంగా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్లు లేవని, కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్ జరుగుతోందని పేర్కొన్నారు. ఒడిశాలో దానికి ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా 57వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రకటన చేయగానే కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. దీపావళి ముందే వచ్చిదంటూ స్వీట్లు పంచుకున్నారు.
Odisha
Naveen Patnaik
Contractual Recruitment

More Telugu News