GHI: ప్రపంచ ఆకలి సూచీలో తక్కువ ర్యాంకింగ్ పై కేంద్రం ఆగ్రహం

Center disagree with Global Hunger Index ranking
  • ప్రపంచ ఆకలి సూచీ-2022 విడుదల
  • భారత్ కు 107వ ర్యాంకు
  • తప్పుడు సమాచారంతో ర్యాంకు ఇచ్చారన్న కేంద్రం
  • మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు
ప్రపంచ ఆకలి సూచీలో భారత్ కు 107వ ర్యాంకు లభించడం తెలిసిందే. మొత్తం 121 దేశాలతో ఈ జాబితా రూపొందించగా, భారత్ ర్యాంకు గతంలో కంటే మరింత దిగజారింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమాత్రం సమంజసం కాని విధానాలతో భారతదేశంలోని ఆకలి అంశాన్ని తప్పుగా గణించారని కేంద్రం విమర్శించింది. 

అంతర్జాతీయంగా భారత్ కున్న ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తక్కువ ర్యాంకింగ్ ఇచ్చారని ఆరోపించింది. ఈ గణన కోసం ఉపయోగించిన నాలుగు సూచీల్లో మూడు చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించినవని, మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని ఆ జాబితా రూపొందించలేదని కేంద్ర మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఇక ముఖ్యమైన నాలుగో సూచీ జనాభా, పోషకాహార లోపం నిష్పత్తికి సంబంధించినదని పేర్కొంది. కానీ, భారతదేశ జనాభాలో కేవలం 3 వేల మంది నుంచి సేకరించిన సమాచారంతో తాజా ర్యాంకింగ్ ఇచ్చారని, ఇది సహేతుకం కాదని స్పష్టం చేసింది. 

భారత్ కున్న మంచిపేరును చెడగొట్టేందుకు ఎప్పట్నించో జరుగుతున్న ప్రయత్నాలకు ఈ తాజా ఇండెక్స్ కొనసాగింపుగా భావిస్తున్నామని కేంద్రం పేర్కొంది. ప్రపంచ ఆకలి సూచీకి తప్పుడు సమాచారమే గీటురాయిలా కనిపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించింది.
GHI
India
Rank

More Telugu News