Iodine Pills: పెద్ద మొత్తంలో అయోడిన్ మాత్రలు కొనుగోలు చేస్తున్న ఉక్రెయిన్ ప్రజలు... ఎందుకంటే...!

  • ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
  • అణు బెదిరింపులకు దిగుతున్న పుతిన్
  • ఆందోళనలో ఉక్రెయిన్ ప్రజలు
  • అణు విస్ఫోటనంతో వాతావరణంలో రేడియో ధార్మికత
  • రేడియో ధార్మికతను అడ్డుకునే అయోడిన్ మాత్రలు!
Ukraine people rushes to buy Iodine tablets

గత ఏడు నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది. లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు ఇప్పటికే స్వదేశాన్ని వీడి పొరుగుదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇక ఉక్రెయిన్ లోనే ఉన్న ప్రజలు ప్రస్తుతం మెడికల్ షాపులకు క్యూలు కడుతున్నారు. వారు అయోడిన్ మాత్రలు కావాలని అడుగుతున్నారని రాజధాని కీవ్ లోని ఓ ఫార్మసీ దుకాణదారు వెల్లడించారు. 

ఉక్రెయిన్ ప్రజలు అయోడిన్ మాత్రల కోసం పోటెత్తడం వెనుక బలమైన కారణం ఉంది. ఇప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణుబాంబు వేసేందుకు వెనుదీయకపోవచ్చన్న ఆందోళన ఉక్రెయిన్ ప్రజల్లో నెలకొంది. అందుకే వారు అయోడిన్ మాత్రల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

అణుబాంబు పేలుడు వల్ల తీవ్రస్థాయిలో రేడియో ధార్మికత వాతావరణంలో వ్యాపిస్తుంది. ఈ రేడియో ధార్మికత మనుషుల్లో థైరాయిడ్ క్యాన్సర్ కలిగిస్తుంది. ఇది మరణానికి దారితీస్తుంది. అణుబాంబు వల్ల కలిగే దుష్పరిణామాలు ఏళ్ల తరబడి ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 

అయితే అయోడిన్ (పొటాషియం అయోడైడ్)... అణుబాంబు కలిగించే రేడియో థార్మికతను సమర్థంగా అడ్డుకుంటుంది. అయోడిన్ మాత్రలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి బలోపేతం అవుతుంది. రేడియో ధార్మికత దానిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. 

అయోడిన్ మాత్రలు వేసుకున్నప్పుడు థైరాయిడ్ గ్రంథి అయోడిన్ తో నిండిపోతుంది. ఈ నేపథ్యంలో, అణుబాంబు పేలుడు ద్వారా వాతావరణంలో కలిసే హానికర అయోడిన్ ను థైరాయిడ్ గ్రంథి స్వీకరించలేదు. 

ఈ అయోడిన్ మాత్రలు అనేక దేశాల ప్రజలు ముందు జాగ్రత్తగా కొనుగోలు చేసి దాచుకుంటుంటారు. ముఖ్యంగా, అమెరికా తదితర దేశాల్లో అయోడిన్ మాత్రల అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. ఇవి చాలా చవకగా లభిస్తాయి.

More Telugu News