Darapaneni Narendra: టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రకు అర్ధరాత్రి దాటిన తరువాత బెయిలు

Darapaneni Narendrababu gets bail in whatsapp post forward Case
  • రాత్రి 10.30 గంటల సమయంలో భారీ బందోబస్తు మధ్య నరేంద్రకు జీజీహెచ్‌లో పరీక్షలు
  • అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో జడ్జి ఎదుట హాజరు పరిచిన అధికారులు
  • జీజీహెచ్ నివేదిక పరిశీలించి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి

టీడీపీ కేంద్ర కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రకు అర్ధరాత్రి దాటిన తరువాత బెయిలు లభించింది. నరేంద్రను మొన్న రాత్రి అరెస్టు చేసిన సీఐడీ అధికారులు నిన్న సాయంత్రం ఆరు గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేందుకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణానికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి ఇంటి వద్ద నరేంద్రను హాజరుపరిచారు. సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారన్న నరేంద్ర ఫిర్యాదు నేపథ్యంలో తొలుత ఆయనకు జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని  న్యాయమూర్తి కె.శృతవింద అధికారులను ఆదేశించారు.

దీంతో రాత్రి 10.30 గంటల సమయంలో భారీ బందోబస్తు మధ్య నరేంద్రను జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో తిరిగి నరేంద్రను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వైద్యుల నివేదికను న్యాయమూర్తికి అందించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం నరేంద్రకు బెయిలు మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగు చూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని వాట్సాప్ గ్రూపులో పోస్టులు ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలతో నరేంద్రను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News