'గాడ్ ఫాదర్' మెగా సక్సెస్... చిరంజీవిని కలిసి అభినందించిన టి.ఎఫ్.జె.ఎ. కార్యవర్గ సభ్యులు

TFJA members appreciates Megastar Chiranjeevi over God Father success
  • అక్టోబరు 5న విడుదలైన గాడ్ ఫాదర్
  • బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం
  • చిరంజీవి నివాసానికి వెళ్లిన టీఎఫ్ జేఏ కార్యవర్గం
  • తేనీటి విందు ఇచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు చిరంజీవి తేనీటి విందు ఏర్పాటు చేశారు. తన చిత్రాల గురించి సినీ పాత్రికేయులతో సవివరంగా ముచ్చటించారు. 

'ఆచార్య' మూవీ తదనంతర పరిణామాలను మనసు విప్పి చెప్పారు. అంతేకాకుండా 'గాడ్ ఫాదర్' సక్సెస్ తర్వాత తనతో సంతోషాన్ని పంచుకుంటున్న వారిని కలుసుకోవడం తన కర్తవ్యంగా భావించానని అన్నారు. 'ఆచార్య' పరాజయానికి తాను కృంగిపోలేదని, ఇప్పుడు 'గాడ్ ఫాదర్' విజయానికి పొంగిపోవడం లేదని, అలాంటి స్థితప్రజ్ఞతను సాధించానని చెప్పారు. 

మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్' ను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనను దర్శకుడు సుకుమార్... రామ్ చరణ్ లో బలంగా కలిగించాడని, సుకుమార్ కు దర్శకత్వం వహించే తీరిక లేకపోవడంతో వేరెవరితో అయినా ఆ ప్రాజెక్ట్ ను ప్రారంభించమని సలహా ఇచ్చాడని అన్నారు. 

ఒకానొక సమయంలో ఆ చిత్రం రీమేక్ ఆలోచన విరమించుకున్నానని, అయితే రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మోహన్ రాజా ను ఎంపిక చేయడంతో మళ్లీ పట్టాలు ఎక్కిందని, మోహన్ రాజా బృందం 'లూసిఫర్' మూవీని తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిందని, అది వర్కౌట్ అయ్యిందని చిరంజీవి అన్నారు. 

ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు రచయితలు తన కోసం వైవిధ్యమైన కథలు చేస్తారనే నమ్మకం కలిగిందని, కరోనా సమయంలో ప్రేక్షకులలో వచ్చిన మార్పు కారణంగానే తాను కూడా 'లూసిఫర్' లాంటి విభిన్న చిత్రాన్ని ధైర్యంతో రీమేక్ చేశానని చిరంజీవి చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. 

అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శకుడు బాబీ 'వాల్తేరు వీరయ్య', మెహర్ రమేశ్ 'భోళా శంకర్' చిత్రాల విశేషాలనూ చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. హెల్త్ కార్డుల పంపిణీ సమయంలో అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉందని అన్నారు. 

ఈ సందర్భంగా టి.ఎఫ్.జె.ఏ అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీ నారాయణ, వై. జె. రాంబాబు స్పందిస్తూ... చిరంజీవి 'గాడ్ ఫాదర్' లాంటి విజయవంతమైన చిత్రాలు మరిన్ని చేయాలని, ఆ రకంగా తామంతా మళ్ళీ మళ్ళీ కలిసే ఆస్కారం ఏర్పడుతుందని  తెలిపారు. 

అయితే... సినిమాలతో సంబంధం లేకుండానే అందరినీ కలుసుకోవాలని తాను కోరుకుంటానని, ఇలాంటి ఆత్మీయ కలయికతో తనకు ఒళ్లు పులకిస్తుందని చిరంజీవి బదులిచ్చారు.
Go Back to Shorts
Chiranjeevi
God Father
Success
TFJA
Cine Journalists
Tollywood

More Telugu News