హిజాబ్ వివాదంపై తీర్పు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనంలో విభజన
- నిషేధాన్ని సమర్థించిన జస్టిస్ హేమంత్ గుప్తా
- కర్ణాటక సర్కారు ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ సుదాన్షు ధూలియా
- దీంతో ప్రధాన న్యాయూమూర్తి ముందుకు వెళ్లిన అంశం
కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. కానీ, జస్టిస్ సుదాన్షు ధూలియా మాత్రం హిజాబ్ ధారణపై కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేశారు. ఏకాభిప్రాయం కొరవడడంతో ఇప్పుడు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కు నివేదించారు. దీంతో ఈ కేసు విచారణ కోసం మరింతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
విద్యా సంస్థల్లో అన్ని మతాల మధ్య ఏకరూపతకు వీలుగా హిజాబ్ ధారణను నిషేధించినట్టు కర్ణాటక సర్కారు సమర్థించుకుంది. ఈ నిషేధం వల్ల ముస్లిం విద్యార్థినులు తరగతులకు హాజరు కాలేరని పిటిషన్ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా ధర్మాసనానికి విన్నవించారు. కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలమైన తీర్పును ఆ రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది మార్చిలో జారీ చేసింది.