Vijayawada: విజయవాడలో బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి

Three Youth Gang Raped 14 Year Girl In Vijayawada
  • బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు
  • స్నేహితులతో కలిసి అత్యాచారం 
  • బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
బాలికతో పరిచయం పెంచుకుని ఆపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్డడ్డాడో ప్రబుద్ధుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్ ప్రాంతానికి చెందిన నిందితుడు సాయి బాధిత బాలిక(14)తో పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది మే నెలలో బాలికను తన బైక్‌పై ఎక్కించుకుని పటమట జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

రెండు రోజుల తర్వాత మరోమారు బాలికను భవనంలోకి తీసుకెళ్లాడు. ఈసారి తన స్నేహితులు బబ్లు, ప్రకాశ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు. గత కొన్ని రోజులుగా బాలిక శరీరాకృతిలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vijayawada
Crime News
Gang Rape
Andhra Pradesh

More Telugu News