Naveen Chandra: తనని హింసిస్తున్న భర్తను ఆ భార్య ఏం చేసిందనే కథనే 'అమ్ము' .. అమెజాన్ ప్రైమ్ లో!

  • ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రగా 'అమ్ము' 
  • భార్యాభర్తల చుట్టూ తిరిగే కథ 
  • దర్శకుడిగా చారుకేశ్ శేఖర్ 
  • ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్ లో 
Ammu Movie Update

తమిళంలో ఐశ్వర్య లక్ష్మికి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆమె ప్రధానమైన పాత్రగా రూపొందిన సినిమానే 'అమ్ము'. కార్తీక్ సుబ్బరాజు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకి చారుకేశ్ శేఖర్ దర్శకత్వం వహించగా అమెజాన్ ప్రైమ్ ద్వారా పలకరించనుంది. 

నవీన్ చంద్ర - ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో భార్యాభర్తలుగా కనిపించనున్నారు. పోలీస్ ఆఫీసర్ రవి పాత్రను నవీన్ చంద్ర పోషించాడు. అతను 'అమ్ము'ను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఆరంభంలో అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో ఆ తరువాత గొడవలు మొదలవుతాయి. రవి తన భార్యను అనేక రకాలుగా హింసిస్తూ ఉంటాడు. ఒక స్థాయి వరకూ పుట్టింటివారి దగ్గర కూడా 'అమ్ము' ఈ నిజాన్ని దాస్తుంది. కానీ రవి ఆమె ఓపికను పరీక్షిస్తూ వెళతాడు. 

రవి ఏమిటో అందరికీ తెలిసేలా చేయాలి .. ఆయనకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. ఇకపై తనపై మాత్రమే కాదు, ఎవరిపై కూడా చెయ్యెత్తకుండా చేయాలి అని నిర్ణయించుకుంటుంది. అందుకోసం అమ్ము ఏం చేస్తుంది? ఆ ఇద్దరి మధ్యలోకి బాబీ సింహా నేరస్థుడి పాత్ర ఎలా ఎంటరవుతుంది? అనేదే కథ. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది..

More Telugu News