Team India: భారత్ స్పిన్ మ్యాజిక్... 99 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా

  • ఢిల్లీలో చివరి వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధావన్
  • అద్భుతంగా రాణించిన బౌలర్లు
  • కుల్దీప్ కు 4 వికెట్లు
  • రెండేసి వికెట్లు తీసిన సిరాజ్, సుందర్, షాబాజ్
Team India scalps South Africa for 99 runs

దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భారత్ స్పిన్ మ్యాజిక్ ధాటికి దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 4, వాషింగ్టన్ సుందర్ 2, షాబాజ్ అహ్మద్ 2 వికెట్లు తీయగా... పేసర్ మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. 

తొలి రెండు వన్డేల్లో మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన సఫారీలు... నేడు ఢిల్లీ పిచ్ పై తేలిపోయారు. దక్షిణాఫ్రికా జట్టులో హెన్రిచ్ క్లాసెన్ చేసిన 34 పరుగులే అత్యధికం. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను టీమిండియా బౌలర్లు కుదురుకోనివ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచారు. సఫారీ ఇన్నింగ్స్ లో చివరి నాలుగు వికెట్లు కుల్దీప్ ఖాతాలో చేరాయి.

పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని పసిగట్టిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతేకాదు, ఇన్నింగ్స్ తొలి ఓవర్ విసిరే చాన్స్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కు అప్పగించాడు. 

సుందర్ తన రెండో ఓవర్లో ప్రమాదకర డికాక్ ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. అక్కడ్నించి సఫారీల పతనం షురూ అయింది. మరో ఎండ్ లో పేసర్ సిరాజ్, స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ కూడా విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది.

More Telugu News