Tharun: నాలుగు సిగరెట్లు తాగేలోగా నేను చెప్పిన కథ 'నువ్వే నువ్వే': త్రివిక్రమ్

  • 2002లో అక్టోబర్ 10న వచ్చిన 'నువ్వే నువ్వే'
  • నిన్నటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సినిమా 
  • తరుణ్ - శ్రియ జోడీగా నడిచిన ప్రేమకథ 
  • దర్శకుడిగా త్రివిక్రమ్ కి మొదటి సినిమా
  • ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్న త్రివిక్రమ్
Nuvve Nuvve 20 years celebrations

అంతవరకూ సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ వచ్చిన త్రివిక్రమ్, 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా మారారు. తరుణ్ - శ్రియ జంటగా నటించిన ఆ సినిమాకి స్రవంతి రవికిశోర్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిన్నటితో 20 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. ఈ వేదికపై త్రివిక్రమ్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 

'నువ్వే కావాలి' సినిమా షూటింగు సమయంలో నేను .. రవికిశోర్ గారు కలుసుకున్నాము. అప్పట్లో నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. నాలుగు సిగరెట్లు పూర్తయ్యేలోగా నేను 'నువ్వే నువ్వే' కథను రవికిశోర్ గారికి చెప్పాను. వెంటనే ఆయన చెక్ బుక్ తీసి ఒక ఎమౌంట్ వేసి నాకు ఇచ్చేశారు. ఆ ఎమౌంట్ తో నేను బైక్ కొనుక్కున్నాను. నన్ను ఆయన అంతగా నమ్మినందుకు నేను ఈ రోజున ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. 

నాకు అవకాశాలు రాని సమయంలో ఆదుకున్నది ఆయనే .. 'నువ్వు నాకు నచ్చావ్' కథను పెద్ద హీరోకి మాత్రమే చెబుతానని నేను అన్నప్పుడు 'సరే నీ ఇష్టం' అంటూ ఒప్పుకోవడం ఆయన గొప్పతనం. ప్రకాశ్ రాజ్ గారంటే చాలామంది టెన్షన్ పడతారు. కానీ నన్ను .. సునీల్ ను చూస్తే ఆయన టెన్షన్ పడేవారు. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్లి ఏదైనా ఉంటే పెట్టమని తినేసే వాళ్లం .. వాచ్ లు .. మందు బాటిల్స్ తెచ్చేసుకునేవాళ్లం. మా ఇద్దరినీ భరించినవారాయన. 

ఫైట్ మాస్టర్ లేకుండానే యాక్షన్ కి సంబంధించిన కొన్ని షాట్స్ నేను తీశాను. 'నీలో ఇంత వయలెన్స్ ఉందని నాకు తెలియదయ్యా' .. అని వెంకటేశ్ అన్నారు. ఈ సినిమాలో సీతారామశాస్త్రి  అద్భుతమైన పాటలు రాశారు. 'గాలిపటం గగనానిదా .. ఎగరేసే ఈ నేలదా' అంటూ అంత గొప్పగా రాసిన ఆయన గురించి ఏం మాట్లాడగలం? అలాంటి ఆయన జ్ఞాపకం ఎప్పటికీ అమరమే. అలాంటి ఆయన పాదాల చెంత నివాళిగా ఈ సినిమాను అర్పిస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News