ED: టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్

  • కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అనంతరం మాణిక్ భట్టాచార్యను అరెస్ట్ చేసిన ఈడీ
  • గతంలో ప్రాథమిక విద్య బోర్డు అధ్యక్షుడిగా పనిచేసిన మాణిక్
  • ఆయన హయాంలోనే టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం
ED arrests TMC MLA Manik Bhattacharya in Bengal education scam

పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో మరో వికెట్ పడింది. టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. సోమవారం ఆయనకు సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. మాణిక్ గతంలో పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్య బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఈ కుంభకోణం చోటుచేసుకున్నట్టు ఈడీ పేర్కొంది. కోల్‌కతా హైకోర్టుకు సమర్పించిన జాబితాలో భట్టాచార్య పేరును కూడా బాగ్ కమిటీ చేర్చింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి ప్రభుత్వం తప్పించింది. 

టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో దర్యాప్తు కోసం కోల్‌కతా హైకోర్టు బాగ్ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజిత్ కుమార్ బాగ్ నేతృత్వంలో పనిచేస్తున్న స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఇది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి పార్థ చటర్జీని అరెస్ట్ చేసిన తర్వాత తొలిసారి మాణిక్ భట్టాచార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ కుంభకోణానికి సంబంధించి కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.

More Telugu News