Moonlighting: మూన్ లైటింగ్ నైతిక సమస్య అంటున్న టీసీఎస్

  • అది తమ కంపెనీ ప్రధాన విలువలకు విరుద్ధమని వ్యాఖ్య
  • మూన్ లైటింగ్ చేస్తున్న తమ ఉద్యోగులపై  చర్యలు తీసుకోలేదని ప్రకటన
  • సాఫ్ట్ వేర్ రంగంలో ప్రధాన సమస్యగా మారిన మూన్ లైటింగ్ 
Moonlighting Ethical Issue But No Action Taken Against Staff says TCS

ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య మూన్ లైటింగ్. ఒక కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ దానికి తెలియకుండా మరో సంస్థలో పని చేయడాన్ని మూన్ లైటింగ్ గా పిలుస్తారు. ఇలా మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని విప్రో ఉద్యోగాల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. భారతదేశంలోని మరో అతి పెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్ మూన్ లైటింగ్ విషయంపై స్పందించింది. మూన్‌లైటింగ్‌ను నైతిక సమస్యగా అభివర్ణించింది. ఇది కంపెనీ ప్రధాన సూత్రాలు, సంస్కృతికి విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే, మూన్ లైటింగ్ చేస్తున్న తమ సంస్థ ఉద్యోగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. 

ఈ సమస్యపై తుది అభిప్రాయాన్ని ఏర్పరుచుకునేటప్పుడు సంబంధిత అన్ని కోణాలను సంస్థ పరిగణనలోకి తీసుకుంటుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్  చెప్పారు. ‘మూన్‌లైటింగ్ అనేది ఒక నైతిక సమస్య అని మేము విశ్వసిస్తున్నాము. ఇది మా ప్రధాన విలువలు, సంస్కృతికి విరుద్ధం’ అని పేర్కొన్నారు. ఇక, తమ కంపెనీ సర్వీస్ కాంట్రాక్ట్ లో భాగం అయిన ఏ ఉద్యోగీ మరే ఇతర సంస్థలోనూ పనిచేయకూడదని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాజేష్ గోపీనాథన్ స్పష్టం చేశారు. 

టీసీఎస్ తన ఉద్యోగుల పట్ల  నిబద్ధతను కలిగి ఉందని, ఉద్యోగులకు కూడా కంపెనీ పట్ల అదే నిబద్ధత ఉందన్నారు. మూన్‌లైటింగ్‌పై కంపెనీ తన వైఖరిని తెలియజేస్తుందని గోపీనాథన్ చెప్పారు. కాగా, మూన్ లైటింగ్ పై ఐటీ పరిశ్రమల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీలు మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్నాయి. టెక్ మహీంద్రా వంటి కొన్ని కంపెనీలు మూన్ లైటింగ్ ఆలోచనను సమర్ధించగా.. ఐబీఎం, విప్రో తదితర కంపెనీలు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి.

More Telugu News