Nigeria: నైజీరియాలో విషాదం.. పడవ బోల్తాపడి 76 మంది జలసమాధి

  • ప్రమాద సమయంలో బోటులో 85 మంది
  • నదికి వరద ఉద్ధృతితో ఒక్కసారిగా బోల్తా పడిన పడవ
  • నైజీరియాలో సర్వసాధారణంగా మారిన ప్రమాదాలు
76 Killed After Boat Capsizes In Flooded River In Nigeria

నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ బోటు మునిగిన ఘటనలో అందులో ఉన్న 76 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 మందితో పడవ వెళ్తుండగా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పడవ బోల్తా పడింది. రాష్ట్రంలోని ఒగబరు ప్రాంతంలో 85 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయిందని, మొత్తం 76 మంది మృతి చెందారని అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ కార్యాలయం పేర్కొంది. ఆయన ఆదేశాలతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నానని అధ్యక్షుడు బుహారీ పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, నదిలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందని సహాయక సిబ్బంది తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరద ఉద్ధృతి ఉందని అధికారులు పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. అనంబ్రా రాష్ట్ర గవర్నర్ చార్లెస్ సోలెడో మాట్లాడుతూ.. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారి కోసం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

పడవ ప్రమాదాలు నైజీరియాలో సర్వసాధారణంగా మారాయి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, వేగం, పేలవమైన నిర్వహణ వంటివి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఇక్కడ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు 300 మందికిపైగా మరణించగా, లక్ష మందికిపైగా నిరాశ్రయులయ్యారు.

More Telugu News