Asaduddin Owaisi: కండోమ్స్ ఎక్కువ‌గా వాడేది ముస్లింలే: ఎంపీ అస‌దుద్దీన్

  • ముస్లిం జ‌నాభా పెరుగుతుంద‌న్న మోహ‌న్ భ‌గ‌వ‌త్ వ్యాఖ్య‌ల‌పై అస‌హ‌నం
  • ముస్లింల సంతానోత్ప‌త్తి రేటు త‌గ్గుతోంద‌ని చెప్పిన అసదుద్దీన్
  • ఖురాన్ చ‌ద‌వాల‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్‌కు సూచ‌న‌
We are using condoms the most quips Owaisi after RSS chiefs population imbalance remark

దేశంలో ముస్లిం జ‌నాభా పెరుగుతోంద‌ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లింల సంతానోత్పత్తి రేటు పెర‌గ‌డం లేద‌ని పడిపోయింద‌ని చెప్పారు. "బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది. కండోమ్‌లు ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మేమే. మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరు" అని అసదుద్దీన్ ఒవైసీ ఒక సభలో చెప్పారు. బుధవారం మోహన్ భగవత్  'జనాభా అసమతుల్యత' సమస్యను లేవనెత్తుతూ, అన్ని సామాజిక వర్గాలకు సమానంగా వర్తించే విధంగా బాగా ఆలోచించి, సమగ్ర జనాభా నియంత్రణ విధానం కోసం పిలుపునిచ్చారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది ఒక ముఖ్యమైన అంశమ‌ని, దాన్ని విస్మరించరాదని కూడా ఆయన అన్నారు. 

దీనిపై తీవ్రంగా స్పందించిన అస‌దుద్దీన్ ఖురాన్ రిఫ‌రెన్స్ తో మోహ‌న్ భ‌గ‌వ‌త్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. "భగవత్ సాహెబ్, నేను మిమ్మల్ని ఖురాన్ చదవమని ఆహ్వానిస్తున్నాను. పిండాన్ని చంపడం చాలా పెద్ద పాపమని అల్లా మాకు చెబుతున్నాడు. రెండు గర్భాల మధ్య అంతరం ఉండేలా ముస్లింలు జాగ్ర‌త్త ప‌డ‌తారు. అందుకు కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. వాస్తవానికి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రికార్డుల ప్రకారం ముస్లింల మొత్తం సంతానోత్పత్తి రేటు 2 శాతానికి తగ్గింది. మీరు చరిత్రను తప్పుగా సూచిస్తే, అది మీ తప్పు. 2020లో మోదీ ప్రభుత్వం కుటుంబ నియంత్రణకు సంబంధించి బలవంతం చేయడం కుదరదని, మాకు అక్కర్లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ మోహన్ భగవత్ మాత్రం జనాభా పెరుగుతోందని అంటున్నారు " అని అస‌ద్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

More Telugu News