Pharmexcil: నకిలీ దగ్గు మందుల కంపెనీకి ఫార్మెగ్జిల్ షాక్

  • ఫార్మెగ్జిల్ సభ్యత్వం నిలిపివేత
  • దీంతో ఎగుమతి ప్రోత్సాహకాలు అందని పరిస్థితి
  • చిన్నారుల మరణాలపై వివరాలు ఇవ్వడంలో విఫలం కావడంతో ఈచర్య
Pharmexcil suspends Maiden Pharma membership

నకిలీ దగ్గు, జలుబు మందులను తయారు చేసి, గాంబియా దేశానికి చెందిన 66 మంది చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమైన హర్యానా ఫార్మా కంపెనీ మెయిడెన్ ఫార్మాస్యూటికల్ కు ఫార్మెగ్జిల్ షాకిచ్చింది. ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ఫార్మెగ్జిల్ గా చెబుతారు. ఫార్మా రంగ ఎగుమతులకు సంబంధించి అత్యున్నత మండలి ఇది. ఈ సంస్థ మెయిడెన్ ఫార్మా సభ్యత్వాన్ని నిలిపివేసింది. దీంతో మెయిడన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఎగుమతి ప్రోత్సాహకాలు రావు. మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ పథకం కింద ప్రోత్సాహకాలకు అర్హత కోల్పోయినట్టు అయింది.


లైసెన్స్ వివరాలు, మెయిడన్ ఫార్మా నుంచి దిగుమతి చేసుకున్న సంస్థలు వివరాలు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అక్టోబర్ 7 నాటికి సమర్పించాలని ఫార్మెగ్జిల్ ఆదేశించింది. అయినా గడువులోపు వివరాలను మెయిడన్ సమర్పించలేదు. దీంతో ఫార్మెగ్జిల్ ఈ నిర్ణయం తీసుకుంది. జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను సమర్పించడంలో విఫలం కావడంతో మెయిడన్ ఫార్మాస్యూటికల్ సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ఫార్మెగ్జిల్ ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన నాలుగు రకాల బ్రాండ్ల దగ్గు, జలుబు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవని, ఇవి ప్రాణాంతకమైనవంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ఔషధ నియంత్రణ మండలిని ఈ నెల 5న అప్రమత్తం చేయడం తెలిసిందే.

More Telugu News