cm kcr: సీఎం కేసీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాసిన బండి సంజ‌య్‌

Bandi sanjay open letter to cm kcr
  • పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేష‌న్‌లో ఈడ‌బ్ల్యూఎస్ కోటా అమ‌లు చేయాల‌ని వినతి
  • ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి ప్ర‌ధాని మోదీ ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లు ప్ర‌వేశ పెట్టార‌న్న సంజ‌య్‌
  • రాష్ట్ర ప్ర‌భుత్వం దీన్ని విస్మ‌రించ‌డం బాధాక‌రం అని వ్యాఖ్య‌
  • ఈడ‌బ్ల్యూఎఫ్ అభ్య‌ర్థుల‌కూ క‌టాఫ్ మార్కుల్లో మిన‌హాయింపు ఇవ్వాల‌ని డిమాండ్ 
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీజేపీ రాష్ట్ర‌ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బ‌హిరంగ‌ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు.

‘ఇటీవల తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మినహాయింపునిచ్చి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపునివ్వక పోవడాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. ఈ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీలకు 20%, బీసీలకు 25%, జనరల్ అభ్యర్థులకు 30% కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. దీంతో 40 మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీలు, 50 మార్కులు వచ్చిన బీసీలు, 60 మార్కులు వచ్చిన జనరల్ అభ్యర్థులకు మెయిన్ పరీక్ష రాయగలరు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడం వల్ల వారు కూడా జనరల్ అభ్యర్థుల మాదిరిగా ప్రిలిమ్స్ లో 60, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారే మెయిన్ పరీక్షకు అర్హులు కాగలరు. 

రిజర్వేషన్ లేని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రవేశపెట్టి అగ్రవర్ణాల పేదలకు న్యాయం చేసింది. అయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపునివ్వకపోవడం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ను సవరిస్తూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ కి 25% అంటే 50 మార్కులను కటాఫ్ గా నిర్ణయించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ’ అని లేఖ‌లో పేర్కొన్నారు.
cm kcr
Bandi Sanjay
bjp
trs
Telangana
police
board
recruitement
ews
quota

More Telugu News