Chandrababu: సర్పంచ్ లను ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తోంది: చంద్రబాబు

Chandrababu said govt treats Sarpanches as beggars
  • వైసీపీ సర్కారుపై చంద్రబాబు ధ్వజం
  • పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని విమర్శలు
  • పంచాయతీలు ఉనికి కోల్పోతున్నాయని వెల్లడి
  • సర్పంచ్ లపై నిర్బంధాలు, కేసులు తొలగించాలని డిమాండ్
రాష్ట్రంలో పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో పంచాయతీలు తమ ఉనికి కోల్పోతున్నాయని పేర్కొన్నారు. 

రాజ్యంగబద్ధంగా తమకు లభించిన హక్కుల కోసం పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు నిన్న చేపట్టిన నిరసనలను ప్రభుత్వం అణచివేయడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. తమ సమస్యలపై గళమెత్తిన సర్పంచ్ లపై కేసులు, నిర్బంధాలు వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ల సంఘం డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, అవి వారి హక్కులుగా గుర్తించాలని అన్నారు. 

"వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు, గ్రామీణ వ్యవస్థలో కీలకమైన పంచాయతీలు నాశనం అవుతున్నాయి. ప్రభుత్వం దారి మళ్లించిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8,700 కోట్లు తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చెయ్యాలి.

2014 తరువాత టీడీపీ హయాంలో దాదాపు రూ. 36 వేల కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు, నరేగా నిధులు పంచాయతీలకే ఇచ్చాము. వీటి ద్వారానే సర్పంచ్ లు గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టారు. తద్వారా గ్రామాలలో సర్పంచ్ ల గౌరవాన్ని పెంచాం. 

అలాంటిది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ లను బిచ్చగాళ్లుగా చూస్తున్న వైఖరి దారుణం. ప్రభుత్వం తన తప్పుదిద్దుకుని ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేయాలి. హక్కుల కోసం పోరాడుతున్న సర్పంచ్ లపై నిర్భంధాలు, కేసులు తొలగించాలి" అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.
Chandrababu
Sarpanch
Panchyat
TDP
YSRCP

More Telugu News