ఎవరెస్ట్ శిఖరంపై టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించిన 80 ఏళ్ల వృద్ధుడు... అభినందించిన చంద్రబాబు

  • మౌంట్ ఎవరెస్ట్ పై టీడీపీ ఫ్లెక్సీ
  • 5 వేల మీటర్ల వరకు ఎక్కిన గింజుపల్లి శివప్రసాద్
  • వీడియో పంచుకున్న చంద్రబాబు
  • సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదన్న టీడీపీ అధినేత
TDP Supremo Chandrababu appreciates Ginjupalli Sivaprasad who displayed TDP Flexi at Mount Everest

హిమాలయాల్లో సమున్నత శిఖరంగా పేరుగాంచిన మౌంట్ ఎవరెస్ట్ పై టీడీపీ ఫ్లెక్సీ ఆవిష్కృతమైంది. గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. 

గింజుపల్లి శివప్రసాద్ వయసు 80 ఏళ్లని తెలిపారు. ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల ఎత్తు వరకు అధిరోహించారని, అక్కడ టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించారని వివరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ గారికి అభినందనలు తెలుపుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. 

తాను గతంలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేపట్టానని తెలిపిన చంద్రబాబు... ఆ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేశారని గుర్తు చేసుకున్నారు. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారని శివప్రసాద్ ను కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు. 

కాగా, ఆ వీడియోలో శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో ఉందని అన్నారు. విజన్ ఉన్న చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకుడిని గెలిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

More Telugu News