Vande bharat: మళ్లీ ఆవును ఢీకొన్న వందే భారత్​ ఎక్స్​ ప్రెస్​

  • గురువారమే నాలుగు గేదెలను ఢీకొన్న వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్
  • రైలు ముందు భాగంలోని ఫైబర్ భాగం విరిగిపోయిన వైనం
  • శుక్రవారం ఆవును ఢీకొట్టిన రైలు.. ముందు భాగంలో బలమైన సొట్ట
Vande bharat train hits cow a day after hits buffaloes

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలు మరో చిన్న ప్రమాదానికి కారణమైంది. గురువారమే నాలుగు గేదెలను ఢీకొని, ముందున్న ఫైబర్ భాగం దెబ్బతిన్న రైలు.. శుక్రవారం ఒక ఆవును ఢీకొట్టింది. ఈసారి రైలు ముందు భాగంలో బలమైన సొట్ట ఏర్పడింది. ఈ ప్రమాదంతో రైలును పది నిమిషాల పాటు ఆపగా.. తర్వాత మామూలుగా ప్రయాణించింది.

గాంధీ నగర్ – ముంబై మధ్య..
కేంద్ర ప్రభుత్వం దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడంలో భాగంగా గుజరాత్ లోని గాంధీ నగర్, మహారాష్ట్రలోని ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఇటీవలే ప్రవేశపెట్టింది. గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ రైలు అతివేగంగా ప్రయాణిస్తున్న సమయంలో పట్టాలపై ఉన్న నాలుగు గేదెలను ఢీకొట్టింది. నాలుగు గేదెలు చనిపోగా.. రైలు ముందు భాగంలోని ఫైబర్ బంపర్ దెబ్బతిన్నది.

  • ఇది జరిగిన మరునాడే శుక్రవారం గుజరాత్ లోని ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపైకి వచ్చిన ఓ ఆవును వందే భారత్ రైలు ఢీకొట్టింది. దీనితో ఫైబర్ బంపర్ స్వల్పంగా దెబ్బతిన్నది.
  • ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందిస్తూ... ‘‘పట్టాలపైకి వచ్చే జంతువులను గమనించడం, వాటిని రైలు ఢీకొట్టకుండా చూడటం సాధ్యంకాదు. పశువులను పెంచుకునేవారు వాటిని రైలు పట్టాలవైపు వెళ్లకుండా చూసుకోవాలి. రైలు ముందు భాగంలోని ఫైబర్ బంపర్ సాధారణమైనదే. దానివల్ల రైలు పనితీరుపై ఎలాంటి ప్రభావం పడదు. వెంటనే తొలగించి మరొకటి ఏర్పాటు చేసుకోవచ్చు..” అని పేర్కొన్నారు. 

More Telugu News