Refined Oils: రిఫైన్డ్ ఆయిల్స్ హాని చేస్తాయా..?

  • రిఫైన్డ్ ప్రక్రియలో ఎన్నో రసాయనాల వినియోగం
  • బ్లీచింగ్, యాసిడ్ ట్రీట్ మెంట్, డియోడరైజ్డ్
  • వీటి వినియోగంతో పెరిగిపోయే కొలెస్ట్రాల్
  • మధుమేహం ముప్పు కూడా ఉంటుంది
Is Refined Oils Good For Health or Bad

ఒకప్పుడు స్వయంగా మిల్లులో నూనె పట్టించుకుని వాడుకోవడమే అందరూ చేశారు. కానీ, పెద్ద పెద్ద కంపెనీలు వంట నూనెల వ్యాపారంలోకి రావడంతో సంప్రదాయ విధానాలు చిన్నబోయాయి. ఇప్పుడు మనం వాడుకుంటున్న అన్ని రకాల నూనెలు కూడా రిఫైన్డ్ చేసినవే. మనం ఎలాంటి వంట నూనె వాడుకుంటున్నామనేది.. ఆరోగ్యం విషయంలో ప్రధానం అవుతుంది. ఆహారంలో ప్రధాన ముడి సరుకు అయిన వంట నూనెలను రిఫైన్డ్ చేసినవి వాడుకోవడం మంచిదేనా? మన ఆరోగ్యంపై వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకుందాం.

రిఫైన్డ్..?
వంట నూనెలను రిఫైన్డ్ చేయడం అంటే శుద్ధి చేయడం. కానీ, ఈ శుద్ధి ప్రక్రియ ఎన్నో విధాలుగా ఉంది. రసాయనాలతో శుద్ధి చేసే విధానాన్నే దాదాపు అన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. దీంతో ఈ  నూనెలు వినియోగించే వారి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. రిఫైన్డ్ ప్రక్రియలో భాగంగా నూనెను యాసిడ్ తో ట్రీట్ చేస్తుంటారు. లేదంటే ఆల్కలీతో ప్యూరిఫై చేస్తారు. లేదంటే బ్లీచ్ చేస్తుంటారు. నూనెను వడగట్టి డియోడరైజ్డ్ చేస్తారు. వీటన్నింటికీ హెక్సేన్ తదితర రసాయనాలు అవసరమని అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ శరద్ జైన్ వివరించారు.

హాని చేస్తాయా?
రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ (చెడు), ట్రై గ్లిజరైడ్స్ తో పాటు ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హానికారక రసాయనాలతో వంట నూనెలను రిఫైన్డ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ కు కారణమయ్యే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పెరిగేందుకు కారణమవుతోంది. ఇది ఇన్సులిన్ స్పందనను మరింత తగ్గిస్తుందని, దీంతో శరీర కణాల్లో ఇన్ఫ్లమేషన్ మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎన్నో అధ్యయనాలు, పరిశోధనల ఫలితాలను పరిశీలిస్తే రిఫైన్డ్ నూనెలతో మన ఆరోగ్యానికి నష్టమే కలుగుతుందని తెలుస్తోంది. 

దీనికితోడు రిఫైన్డ్ నూనెలను ఒకటికి రెండు సార్లు మళ్లీ మళ్లీ కాచి వాడుకోవడం మరింత ప్రమాదకరం. అదే నూనెను మళ్లీ కాచి వాడుకోవడం ద్వారా అనర్థాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కేన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిఫైన్డ్ వంట నూనెల వినియోగంతో దీర్ఘకాలంలో రక్తపోటు పెరుగుతుంది. గుండె జబ్బులు రావచ్చు. కనుక రిఫైన్డ్ నూనెలను పక్కన పెట్టి దగ్గరుండి తీసిన వంట నూనెను వాడుకోవడమే సురక్షితం.

More Telugu News