Lionel Messi: సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ సంచలన ప్రకటన.. ఖతర్ ప్రపంచకప్ చివరిదన్న అర్జెంటీనా స్టార్

  • వచ్చే నెలలో ఖతర్‌లో ప్రపంచకప్ 
  • ఐదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ
  • చివరి మ్యాచ్‌కు ముందు ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నట్టు అంగీకారం
  • గత 35 మ్యాచుల్లో ఓటమన్నదే ఎరుగని అర్జెంటీనా
  • తాము పేవరెట్లం కాదన్న మెస్సీ
Lionel Messi says 2022 World Cup with Argentina will be his last


అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ సంచలన ప్రకటన చేశాడు. వచ్చే నెల ఖతర్‌లో జరగనున్న ప్రపంచకప్ తనకు చివరిదని పేర్కొన్నాడు. తన కెరియర్‌లో ఐదో ప్రపంచకప్ ఆడబోతున్న మెస్సీ (35) .. రిటైర్ అవుతూ తొలి టైటిల్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. కెరియర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్నందుకు ఒకే సమయంలో ఆందోళన, ఒత్తిడి ఫీలవుతున్నట్టు ‘స్టార్‌ప్లస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెస్సీ అంగీకరించాడు. టోర్నీ తర్వాత తన భవిష్యత్‌పై మెస్సీ బహిరంగంగా మాట్లాడడం ఇదే తొలిసారి. అయితే, ఖతర్‌లో జరిగే ప్రపంచకప్ తర్వాత జాతీయ జట్టు నుంచి తప్పుకుంటున్నదీ, లేనిదీ మాత్రం కచ్చితంగా మెస్సీ వెల్లడించలేదు. గత 35 మ్యాచ్‌ల్లో పరాజయం అన్నదే ఎరుగని అర్జెంటీనా పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌కు బయలుదేరుతోంది. 2021 కోపా అమెరికా ఫైనల్‌లో ఆతిథ్య బ్రెజిల్‌పై విజయం సాధించిన తర్వాత ఓటమి అన్నదే ఎరగని జట్టుగా రికార్డులకెక్కింది.  

‘‘ప్రపంచకప్‌లో ఏమైనా జరగొచ్చు. మ్యాచ్‌లన్నీ చాలా కఠినంగా ఉంటాయి. ఫేవరెట్లు అయినంత మాత్రాన విజయం సొంతమవుతుందని ఏమీ లేదు’’ అని మెస్సీ పేర్కొన్నాడు. ‘‘మేం ఫేవరెట్లమా? కాదా? అన్న విషయం నాకైతే తెలియదు. అయితే, చరిత్రను చూస్తే మాత్రం అర్జెంటీనా పోటీలో నిలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ అవకాశం మరింత ఎక్కువగా ఉంది. కానీ, మేం ఫేవరెట్లం కాదు. మిగతా జట్లు మా కంటే కొంత పైనున్నాయనే అనుకుంటా’’ అని మెస్సీ వివరించాడు. 

అర్జెంటీనా 1978, 1986 ప్రపంచకప్‌లలో విజయం సాధించింది. వచ్చే నెల 22న గ్రూప్-సిలో సౌదీ అరేబియాతో పోరుతో అర్జెంటీనా ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత మెక్సికో, పోలండ్‌తో తలపడుతుంది. తాను శారీరకంగా బాగానే ఉన్నట్టు మెస్సీ చెప్పుకొచ్చాడు.

More Telugu News