Masjid: మసీదులోకి ప్రవేశించి దుర్గా పూజ చేసిన వ్యక్తులు.. వీడియో షేర్ చేస్తూ, విమర్శలు గుప్పించిన ఒవైసీ

  • కర్ణాటకలోని బీదర్ లో ఘటన
  • దుర్గామాత ఊరేగింపు సందర్భంగా మసీదులోకి వెళ్లిన వ్యక్తులు
  • ముస్లింలను కించపరచడానికి బీజేపీ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందన్న ఒవైసీ
Mob enters masjid and performs pooja

దసరా ఊరేగింపు సందర్భంగా కొందరు వ్యక్తులు ఒక మసీదులోకి ప్రవేశించి నినాదాలు చేశారు. ఆ భవనంలోని ఒక మూలలో పూజను కూడా నిర్వహించారు. ఈ ఘటన కర్ణాటకలోని బీదర్ లో చోటుచేసుకుంది. చరిత్రాత్మక మహమ్ముద్ గవాన్ మసీదు, మదరసాలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు... వీరిలో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులందరినీ అరెస్ట్ చేయకపోతే శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసన కార్యక్రమాలను చేపడతామని ముస్లిం సంఘాలు హెచ్చరించాయి. 

మరోవైపు ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మసీదు గేటు పగులగొట్టి మసీదును అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఇలాంటి వాటిని మీరు ఎలా అనుమతిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీదర్ పోలీసులను ప్రశ్నించారు. ముస్లింలను కించపరచడానికి బీజీపీ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

More Telugu News