New Delhi: ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయలో దారుణం.. పాఠశాలలోనే 11 ఏళ్ల బాలికపై అత్యాచారం

11 Year Old Girl Gang Raped in Delhi kendiya vidyalaya
  • సీనియర్లను పొరపాటున ఢీకొట్టిన విద్యార్థిని
  • సారీ చెప్పినా వినిపించుకోకుండా టాయిలెట్ గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం
  • టీచర్‌కు చెబితే బయట ఎక్కడా చెప్పొద్దన్న వైనం
  • విచారణకు ఆదేశించిన ఢిల్లీ మహిళా కమిషన్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కేంద్రీయ విద్యాలయలో 11 ఏళ్ల బాలికపై 11, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. జులైలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. తనపై జరిగిన అఘాయిత్యంపై బాధిత బాలిక అదే రోజు టీచరుకు చెప్పినప్పటికీ దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో విషయం ఇన్నాళ్లు మరుగునపడిపోయింది. తాజాగా, బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. బాలిక తన క్లాస్ రూములోకి వెళ్తుండగా పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొట్టింది. ఆమె వారికి క్షమాపణలు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి గడియపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లగా, నిందితులైన ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించామని, ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని చెప్పింది. తాజాగా, ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్.. ప్రిన్సిపాల్‌తోపాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ మాట్లాడుతూ.. స్కూల్లోనూ అమ్మాయిలకు రక్షణ లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో స్కూలు అధికారుల పాత్రపైనా విచారణ జరగాలని అన్నారు. దీనిపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం స్పందించింది. జరగిన ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే, స్కూలు వర్గాల వాదన మరోలా ఉంది. తానీ విషయాన్ని టీచర్‌కు చెప్పానని బాధిత బాలిక చెబుతుండగా, బాలిక కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.
New Delhi
Kendriya Vidyalaya
Gang Rape

More Telugu News