రిజిస్ట్రేష‌న్ ఆదాయాన్ని పెంచేదెలా?... ఉన్న‌త స్థాయి క‌మిటీని నియ‌మించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

06-10-2022 Thu 16:14
  • ఆదాయాన్నిచ్చే శాఖ‌ల‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌
  • రిజిస్ట్రేష‌న్ శాఖ‌పై న‌లుగురు ఉన్న‌త స్థాయి అధికారులతో క‌మిటీ
  • 2 వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని క‌మిటీకి ఆదేశాలు
  • నాటుసారా కాసే వారికి ప్ర‌త్యామ్నాయ ఉపాధి చూపాల‌ని జ‌గ‌న్ ఆదేశం
ap cm jagan appoints a high level committe on registration department
ఏపీలో ఆదాయాన్నిచ్చే శాఖ‌ల‌పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా రిజిస్ట్రేష‌న్ శాఖ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల‌ను అన్వేషించాలంటూ ఆయ‌న ఓ ఉన్న‌త స్థాయి క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు కృష్ణ‌బాబు, ర‌జ‌త్ భార్గ‌వ‌, నీరబ్ కుమార్ ప్ర‌సాద్‌, గుల్జార్‌లు ఉన్నారు. రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, సుల‌భ‌త‌ర విధానాల‌ను అమ‌లు చేస్తూనే ఆదాయ పెంపుపై సూచ‌న‌లు ఇవ్వాలంటూ స‌ద‌రు క‌మిటీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. 2 వారాల్లోగా నివేదిక అందజేయాల‌ని క‌మిటీకి సూచించారు. 

ఇదిలా ఉంటే... రాష్ట్ర ఆదాయం క్ర‌మంగా పెరుగుతోంద‌ని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథ‌మార్థంలో నిర్దేశించుకున్న ఆదాయాల లక్ష్యంలో 94.47శాతం చేరుకున్నామని వెల్ల‌డించారు. జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు కన్నా.. రాష్ట్ర సగటు అధికంగా ఉందని కూడా అధికారులు తెలిపారు. అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపాలని అధికారులను సీఎం ఆదేశించారు.