'ఆదిపురుష్' టీజర్ పై భారీ ట్రోలింగ్... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

06-10-2022 Thu 16:03
  • ప్రభాస్ హీరోగా ఆదిపురుష్
  • ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం
  • ఇటీవల టీజర్ విడుదల
  • రావణ, హనుమంతుడి పాత్రలపై ట్రోలింగ్
Ram Gopal Varma opines on Adipurush teaser
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'ఆదిపురుష్'. ఇటీవలే ఈ చిత్రం నుంచి టీజర్ రాగా, అందులో రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ వేషధారణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే, హనుమంతుడి రూపురేఖలు కూడా ట్రోలింగ్ కు కారణమయ్యాయి. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 

రామాయణం అంటే ఇలా ఉంటుందని, రాముడు అంటే ఇలా ఉంటాడని మనకు ఒక ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. కానీ 'ఆదిపురుష్' లో ఆయా పాత్రలు మన ఆలోచనకు భిన్నంగా ఉండడంతో విమర్శలు వస్తున్నాయని  తెలిపారు. 

వాస్తవానికి తనకు కూడా సైఫ్ అలీ ఖాన్ లుక్ నచ్చలేదని వర్మ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రావణుడిగా పొడవాటి జుట్టు, భారీ ఆకారం, గంభీరమైన చూపులతో ఎస్వీ రంగారావును చూడ్డానికి అలవాటుపడ్డానని, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజర్ లో సైఫ్ అలీ ఖాన్ ను చూశాక కొంచెం బాధగా అనిపించిందని, ఇదేంటి ఇలా ఉన్నాడు అనుకున్నానని వర్మ వివరించారు. 

ఓ నిర్మాత కూడా తనకు ఫోన్ చేసి 'ఆదిపురుష్' లో రాముడేంటి మీసాలతో ఉన్నాడు అని అడిగాడని, అయితే రాముడ్ని మీసాలతో ఎందుకు చూపించకూడదన్నది చిత్రబృందం ఆలోచన అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆదిపురుష్ చిత్రబృందం ఆలోచన తప్పయితే అందుకు వాళ్లే మూల్యం చెల్లించుకుంటారని వర్మ పేర్కొన్నారు. 

మనది ప్రజాస్వామ్య దేశం అని, ఎవరు ఏదైనా చేయొచ్చని, ఇప్పుడు 'ఆదిపురుష్' చిత్రాన్ని కూడా వాళ్లు తమకు నచ్చిన రీతిలో తీస్తున్నారని తెలిపారు. నచ్చినవాళ్లు చూస్తారు, నచ్చనివాళ్లు చూడరు... అంతే తప్ప, ట్రోలింగ్ చేయడం సరికాదని హితవు పలికారు. 

తాము రామాయణాన్ని విభిన్నరీతిలో చూపిస్తున్నామని 'ఆదిపురుష్' చిత్రబృందం ముందే ప్రకటించి ఉంటే బాగుండేదని, అలా చెప్పకపోవడం వల్లే టీజర్ చూశాక ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. పైగా 'ఆదిపురుష్' టీజర్ చూశాక సినిమా ఓ యానిమేటెడ్ ఫిల్మ్ లా అనిపిస్తోందని, పాత్రల్లో సహజత్వం కనిపించలేదని అన్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూస్తే కానీ తెలియదని వ్యాఖ్యానించారు.