Iran: ఇరాన్​ లో భారీ భూకంపం.. కూలిన వందల ఇళ్లు.. వందలాది మందికి గాయాలు

Iran earthquake over 500 injured
  • అజర్ బైజాన్ ప్రాంతంలో భూఉపరితలానికి పది కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం
  • పలు గ్రామాలు, పట్టణాల్లో తీవ్రంగా విధ్వంసం.. విద్యుత్ సరఫరా బంద్
  • యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారుల వెల్లడి
మధ్యప్రాచ్యంలోని ఇరాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. 5.4 తీవ్రతతో నమోదైన భూకంపం, దాని తర్వాత వెనువెంటనే వచ్చిన మరికొన్ని ప్రకంపనలతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 12 గ్రామాలు, పట్టణాల పరిధిలో 500కు పైగా ఇళ్లు కూలిపోయాయి. ముఖ్యంగా 50 ఇళ్లు అయితే నామరూపాలు లేనంతగా పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆ దేశ అధికార వర్గాలు ప్రకటించాయి.

528 మందికిపైగా గాయాలు..
ఇరాన్ లోని వెస్ట్ అజర్ బైజాన్ ప్రాంతంలో భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించినట్టు ఆ దేశ వాయవ్య రీజియన్ గవర్నర్ మహమ్మద్ సదేగ్ మొటమిడియన్ చెప్పారు. “స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా 528 మంది గాయపడ్డారు. అందులో 135 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నాం. సుమారు 500కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి..” అని వివరించారు.

  • ఇక విద్యుత్ సరఫరా లైన్లు టవర్లు, స్తంభాలు కూలిపోవడంతో పలు గ్రామాలకు కరెంటు నిలిచిపోయినట్టు ఆ దేశ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి మొజ్తాబా ఖలేదీ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
  • భూఉపరితల పొరల దిగువన టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఇరాన్ ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది.
  • కాగా ఇంతకుముందు 1990లో 7.4 తీవ్రతతో అతి భారీ భూకంపం ఇరాన్ ను కుదిపేసింది. ఆ భూకంపంలో ఏకంగా 40 వేల మందికిపైగా చనిపోయారు. మూడు లక్షల మందికి పైగా గాయపడ్డారు.
  • 2003లోనూ ఆగ్నేయ ఇరాన్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం రావడంతో 31 మందికి పైగా మరణించారు. 
Iran
Earthquake
people injured
International

More Telugu News