Social Media: సోషల్ మీడియా వినియోగం శృతి మించితే.. డిప్రెషన్

  • ఓ అధ్యయనంలో తేలిన విషయం
  • రోజులో 5 గంటల కంటే ఎక్కువ చూస్తే అనర్థాలు
  • ప్రతికూల భావనలు పెరుగుతాయంటున్న శాస్త్రవేత్తలు
  • వ్యక్తిగత సంబంధాలు తగ్గిపోతాయని హెచ్చరిక
Excess social media consumption likely develop depression in young adults study

సోషల్ మీడియాను వినియోగించని వారు తక్కువే. కానీ, పరిమిత వినియోగమే మంచిది. అదే పనిగా గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో గడుపుతుంటే.. ఆరు నెలల్లోనే డిప్రెషన్ బారిన పడొచ్చంటూ ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఈ అధ్యయన వివరాలు ‘జర్నల్ ఆఫ్ అఫెక్టివ్ డిజార్డర్స్’లో ప్రచురితమయ్యాయి. 

సోషల్ మీడియా వినియోగం, వ్యక్తిత్వ నిర్మాణం, డిప్రెషన్ పెరగడం మధ్య అనుబంధాన్ని అధ్యయనంలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ అర్కన్సాస్ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ డాక్టోరల్ విద్యార్థి రెనే మెరిల్ ఈ అధ్యయన పత్రాలను రూపొందించారు. గతంలో పలు అధ్యయనాలు ఎన్నో అంశాల వల్ల డిప్రెషన్ వస్తుందని తేల్చగా, తాజా అధ్యయనం సోషల్ మీడియాతో లింక్ ను గుర్తించే ప్రయత్నం చేసింది.

తక్కువ వినియోగించే వారితో పోలిస్తే, సోషల్ మీడియాను ఎక్కువగా చూసే వారికి 49 శాతం అధిక డిప్రెషన్ రిస్క్ ఉందని తెలిసింది. అలాగే, సాధారణ వ్యక్తులతో పోలిస్తే నరాల సంబంధ వ్యాధులు ఉన్న వారు సోషల్ మీడియా వినియోగం కారణంగా డిప్రెషన్ బారిన పడే రిస్క్ రెండింతలు ఎక్కువగా ఉందని తేలింది. రోజులో 300 నిమిషాలను అధ్యయనానికి ప్రామాణికంగా తీసుకున్నారు.  ఐదు గంటలకు మించి అదే పనిగా సామాజిక మాధ్యమాల వినియోగం ప్రమాదకరమని తెలుస్తోంది.

అమెరికాలో 1,000 మంది (18-30 ఏళ్ల మధ్య వయస్కులు)పై 2018 నుంచి ఈ అధ్యయనం జరిగింది. రోజులో ఎంత సమయం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై గడుపుతున్నారు, ఆరోగ్య సమస్యలు తదితర అంశాలపై ప్రశ్నల ఆధారంగా డిప్రెషన్ రిస్క్ ను శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. సామాజిక పరిశీలనతో ప్రతికూల భావనలు పెరుగుతాయని, సోషల్ మీడియా వినియోగంతో డిప్రెషన్ రిస్క్ పెరుగుతుందని ఈ అధ్యయనం గుర్తించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రతికూల కంటెంట్ ప్రభావం చూపిస్తుందని, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల వ్యక్తిగత సంప్రదింపులు తగ్గిపోతాయని హెచ్చరించింది. కనుక అన్నేసి గంటలు కాకుండా రోజులో గంట, రెండు గంటలు (ఒకే విడత కాకుండా) సామాజిక మాధ్యమాలకు కేటాయించడం ద్వారా ఈ రిస్క్ లేకుండా చూసుకోవచ్చు.

More Telugu News