Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనూ టికెట్లు!

  • స్టేషన్ల వద్దనున్న క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్‌లో స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు
  • 83411 46468 నంబరు హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారానూ టికెట్ కొనుగోలుకు అవకాశం
  • దేశంలోనే తొలిసారి ఈ విధానాన్ని తీసుకొచ్చామన్న మెట్రో అధికారులు
Hyderabad Metro passengers now can by tickets by whatsapp

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ఇక నుంచి వాట్సాప్‌లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పేటీఎంలో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అధికారులు మరింత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం తీసుకొచ్చారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ వాట్సాప్ కామన్ కావడంతో టికెట్లు కోసం ఇకపై క్యూలో నిల్చునే బాధ తప్పినట్టే. దేశంలోనే తొలిసారి తాము ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ఈ మేరకు బిల్ ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు.

వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయాణికులు తొలుత 83411 46468 నంబరుకు వాట్సాప్‌లో హాయ్ చెప్పాలి. ఆ వెంటనే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసిన తర్వాత మనం వెళ్లాల్సిన చోటును ఎంటర్ చేయాలి. అనంతరం టికెట్ రుసుమును చెల్లించిన వెంటనే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఇ-టికెట్ వస్తుంది. అలాగే, మెట్రో స్టేషన్ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి కూడా టికెట్లు కొనుగోలు చేయొచ్చని అధికారులు తెలిపారు.

More Telugu News