క్రియాశీల రాజకీయాలకు దూరం: మేఘాలయ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

01-10-2022 Sat 06:44
  • నిన్నటితో ముగిసిన గవర్నర్ పదవీకాలం
  • ఆర్‌ఎల్‌డీ పార్టీలో చేరుతారని వార్తలు
  • కొట్టిపారేసిన సత్యపాల్ మాలిక్
Satya Pal Malik says Have no plans to join active politics
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌గా ఆయన పదవీకాలం నిన్నటితో పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) పార్టీలో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన ఆయన తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు లేవని, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అసలే లేదని మాలిక్ స్పష్టం చేశారు. అయితే, రైతు సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. 

ఎల్లుండి షామ్లీలో జరగనున్న ‘కిసాన్ సమ్మేళన్’లో ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరితో కలిసి మాలిక్ పాల్గొంటారన్న వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఆర్ఎల్‌డీలో చేరడం ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి. దీనిపై మాలిక్ స్పందిస్తూ.. షామ్లీ సమావేశం పూర్తిగా రైతులను ఉద్దేశించినది, అయినా అక్కడ 144 సెక్షన్ అమలవుతుండడంతో అది రద్దయిందని తెలిపారు. కాగా, సత్యపాల్ మాలిక్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగానే విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు సాగుచట్టాలను విమర్శించిన ఆయన జమ్మూకశ్మీర్‌లో అవినీతిపైనా విమర్శలు చేశారు. 2020 నుంచి మాలిక్ మేఘాలయ గవర్నర్‌గా ఉన్నారు. అంతకుముందు బీహార్, జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు.