ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం... బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్న సూర్య, అజయ్ దేవగణ్

30-09-2022 Fri 20:28
  • ఇటీవల జాతీయ అవార్డుల ప్రకటన
  • నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం
  • అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
Suriya and Ajay Devgan receives national best actor award
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. 

జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తమిళ హీరో సూర్య, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ అందుకున్నారు. 'సూరారై పొట్రు' చిత్రంలో ఉదాత్తమైన నటన కనబర్చినందుకు గాను సూర్య, 'తానాజీ' చిత్రంలో విశేషరీతిలో మెప్పించినందుకు అజయ్ దేవగణ్ ను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. 

ఇక ఉత్తమ నటి అవార్డును అపర్ణ బాలమురళి అందుకున్నారు. గాయనిగా పేరుపొందిన అపర్ణ బాలమురళి సూరారై పొట్రు చిత్రంలో సూర్య సరసన కథానాయికగా నటించారు. గతంలో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ, సూరారై పొట్రు చిత్రంలో నటనకు విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు. 

కాగా, ఈసారి ఉత్తమ చిత్రం అవార్డు 'సూరారై పొట్రు'కు దక్కడం తెలిసిందే. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్ ఫొటో' ఎంపికైంది. 'అల వైకుంఠపురములో' చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ కు అవార్డు లభించింది. బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో తెలుగు చిత్రం నాట్యం ఎంపికైంది.