Telangana: 21 ఏళ్లు నిండాకే పెళ్లికి రెడీ అంటున్న తెలంగాణ యువతులు!

  • గణాంకాలు విడుదల చేసిన కేంద్రం
  • దేశంలో 21 ఏళ్లు నిండాక పెళ్లి చేసుకుంటున్న యువతుల సంఖ్య 70 శాతం
  • 80 శాతానికి పైగా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి తెలంగాణ తర్వాత తమిళనాడుకు మాత్రమే చోటు
  • కర్ణాటకలో ఆందోళనకరంగా బాల్య వివాహాలు
  • కేరళలో లేనే లేని బాల్య వివాహాలు
Telangana girl changing their thoughts on marriage age

పెళ్లి విషయంలో అమ్మాయిల ఆలోచనా ధోరణి మారుతోంది. యువతులతోపాటు వారి తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు వస్తోంది. అమ్మాయికి 18 ఏళ్లు రాగానే హడావిడిగా పెళ్లి చేసేయాలన్న ఆలోచనకు తల్లిదండ్రులు కూడా దూరం జరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. దేశంలో 70 శాతం మంది యువతులు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకుంటున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇది 80.5 శాతంగా ఉండడం పెళ్లిపై వారికున్న దృక్పథానికి అద్దం పడుతోంది. కాగా, ప్రస్తుతం అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు కాగా, దానిని 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం రెండేళ్ల క్రితమే బిల్లు ప్రవేశపెట్టింది.

21 ఏళ్లలోపు వివాహం చేసుకుంటున్న అమ్మాయిల సంఖ్య 30 శాతమే ఉన్నట్టు కేంద్ర గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ జాబితాలో బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ 18 ఏళ్లు కూడా నిండకుండానే అమ్మాయిల మెడలో మూడుముళ్లు పడుతున్నాయి. ఈ విషయంలో జమ్మూకశ్మీర్ చాలా మెరుగ్గా ఉంది. 2020లో అక్కడ 10 శాతం కంటే తక్కువ మంది అమ్మాయిలు 21 ఏళ్లలోపు దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో ఇది 17 శాతంగా ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో 18.6 శాతం మంది యువతులు 18 నుంచి 20 ఏళ్ల మధ్య పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 

21 ఏళ్లు, ఆ తర్వాత వివాహాలు చేసుకుంటున్న యువతులు 80 శాతానికి మించి ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి తెలంగాణ తర్వాత తమిళనాడు (82శాతం)కు మాత్రమే చోటు దక్కింది. మిగతా రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి.

మరోపక్క, కర్ణాటకలో మాత్రం బాల్య వివాహాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 2021-22లో 418 బాల్య వివాహాలు జరిగాయి. 2017-18తో పోలిస్తే ఇది 300 శాతం అధికం కావడం గమనార్హం. అక్షరాస్యత పరంగా అగ్రస్థానంలో ఉన్న కేరళలో ఒక్క బాల్య వివాహం కూడా జరగలేదు. తెలంగాణలో బాలవధువుల సగటు వయసు 15 ఏళ్లుగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News