BCCI: బీసీసీఐ తొందరపాటే బుమ్రాకు శాపమైందా?

BCCI pays price for RUSHED return of bumrah
  • జులైలో ఇంగ్లండ్ పర్యటన తర్వాత బుమ్రాకు వెన్ను గాయం
  • ఆసియా కప్ కు దూరంగా ఉన్న స్టార్ పేసర్
  • పూర్తిగా కోలుకోకముందే తిరిగి జట్టులోకి తీసుకున్నారన్న విమర్శలు
  • ఫలితంగా టీ20 ప్రపంచ కప్ నకు దూరం అవుతున్న బుమ్రా
వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ ముంగిట టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం వల్ల ఈ టోర్నీకి దూరమవ్వగా.. భారత పేస్ దళపతి జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా మెగా టోర్నీ నుంచి వైదొలగడం దాదాపు ఖాయమైంది. వెన్ను గాయం కారణంగా అతనీ టోర్నీలో పాల్గొనడం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుమ్రా లేకుంటే వరల్డ్‌ కప్‌లో భారత్ అవకాశాలు కచ్చితంగా దెబ్బతింటాయి. బుమ్రా విషయంలో బీసీసీఐ తొందరపాటు నిర్ణయమే అతడిని ప్రపంచకప్ నకు దూరం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి.

జులైలో  ఇంగ్లండ్‌ పర్యటనలో వెన్ను గాయానికి గురైన బుమ్రా ఆసియా కప్‌నకు దూరంగా ఉన్నాడు. దాని నుంచి కోలుకున్న తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పునరాగమనం చేశాడు. ఆ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న జస్‌ప్రీత్‌ రెండో మ్యాచ్‌లో రెండు ఓవర్లు, మూడో టీ20లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఈలోపు గాయం తిరగబెట్టింది. సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా నడుం నొప్పి వచ్చిందని ఫిర్యాదు చేయడంతో అతడిని మ్యాచ్‌ నుంచి తప్పించారు. తర్వాత సిరీస్ నుంచి కూడా తప్పించారు. 

అయితే, కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే బుమ్రా గాయం తిరగబెట్టడంతో తను పూర్తిగా కోలుకోకముందే తిరిగి జట్టులోకి తీసుకొచ్చారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.  ప్రపంచ కప్‌ నేపథ్యంలో బుమ్రా రీఎంట్రీ విషయంలో బీసీసీఐ తొందరపడి మూల్యం చెల్లించుకుందన్న విమర్శలు వస్తున్నాయి. మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా బౌలింగ్ శైలి వేరుగా ఉంటుంది. దానివల్ల అతను గాయాలపాలయ్యే ప్రమాదం ఎక్కువ. ఈ విషయం తెలిసి కూడా బోర్డు తొందర పడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, బుమ్రా గాయానికి శస్త్ర చికిత్స అవసరం లేకపోయినా.. పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. బుమ్రా దూరమైతే ప్రపంచ కప్‌ స్టాండ్‌ జాబితాలో ఉన్న దీపక్‌ చహల్‌ లేదా మహ్మద్‌ షమీని ప్రధాన జట్టులోకి చేర్చే అవకాశం ఉంది.
BCCI
Team India
bumrah
T20 World Cup

More Telugu News