Shahrukh Khan: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట కేసు.. షారూఖ్‌కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు

bollywood actor shahrukh khan got relief in supreme court in 2017 Stampede Case
  • వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమయ్యారని కేసు
  • గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన షారూఖ్ ఖాన్
  • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన పిటిషనర్
  • హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీం ధర్మాసనం
2017లో నమోదైన కేసు నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు షారూఖ్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును కొట్టివేయాలంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. ‘రాయిస్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా షారూఖ్ తన చిత్రబృందంతో కలిసి 2017లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూఖ్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది.

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు షారూఖ్ ఖాన్ కారణమయ్యారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుబాయ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ షారూఖ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును విచారించిన కోర్టు షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, గుజరాత్ హైకోర్టు తీర్పును ఫిర్యాదుదారుడు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. నిన్న దీనిని విచారించిన జస్టిస్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది.
Shahrukh Khan
Vadodara Railway Station
Gujarat High Court
Supreme Court
Bollywood
Raees

More Telugu News