నేడు నింగిలో అరుదైన పరిణామం.. మళ్లీ 107 ఏళ్ల తర్వాతే!

26-09-2022 Mon 11:47
  • భూమికి చేరువగా రానున్న గురు గ్రహం
  • 59 ఏళ్ల తర్వాత పునరావృతం
  • మళ్లీ 2129లో ఇది ఆవిష్కృతం
  • రేపు నింగిలో ప్రకాశవంతంగా కనిపించనున్న గురువు
Jupiter closest to Earth tonight Next time it comes this close even your children wont be here
నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. శనిగ్రహం, గురువు, భూమి మూడు ఒకే రేఖ లో కనిపించనున్నారు. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 1963లో ఇది సాధ్యమైంది.

మళ్లీ ఈ దృశ్యాన్ని చూడాలంటే ఎన్నో తరాలు ఆగాల్సిందే. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది. అంటే ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే భాగ్యం ఉండదు. భూమికి సమీపానికి వచ్చినప్పుడు.. భూమి నుంచి గురు గ్రహం మధ్య దూరం 59,06,29,248 (59.06 కోట్లు) కిలోమీటర్లు ఉంటుంది. భూమికి దూరంగా వెళ్లినప్పుడు 96,56,06,400 (96.56కోట్లు) కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుంది. 

సౌర వ్యవస్థలో అతిపెద్దదైన గురు గ్రహం భూమికి సమీపానికి వచ్చినప్పుడు.. ఇంకా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. ప్రతి 399 రోజులకు ఒకసారి (13 నెలల నాలుగు రోజులు) జూపిటర్ భూమికి వ్యతిరేక దిశలోకి వస్తుంది. అప్పుడు ఆకాశంలో గురుగ్రహం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది. ఇది మంగళవారం ఆవిష్కృతం కానుంది. సోమవారం సాయంత్రం మాత్రం భూమికి సమీపానికి రానుంది.